అవసరమైతే ఒంటరి పోరాటానికి సిద్ధం…కుదిరితే కలిసి వస్తా…లేదంటే ఒంటరి పోరాటం చేస్తా…ఇవి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్. ఇపుడు పవన్ చేసిన ఈ కామెంట్స్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మాటల వెనుక అర్థం టీడీపీకి…చిన్నపాటి ఝలక్ ఇచ్చారన్న వాదనలు వినిపిస్తున్నాయి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత అనేక విమర్శలు రావడంతో…క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మన గౌరవం తగ్గకుండా ఉంటేనే పొత్తు పెట్టుకుంటానంటూ…పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. గౌరవం అనేది ఏ మాత్రం తేడా వచ్చినా…వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు పంపారు పవన్ కల్యాణ్.
తెలుగుదేశం పార్టీ… తనను బలహీనంగా తీసుకోవద్దనేలా హెచ్చరికలు జారీ చేశారు జనసేనాని. ఏ పార్టీతో అయినా పొత్తు గౌరవంగా ఉండాలని…అది లేకపోతే ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు. ఒకపక్క ఒంటరిగా పోరాటానికి సిద్ధమంటూనే…కలిసి పోటీ చేస్తే ఏం సాధించొచ్చు చెప్పుకొచ్చారు. హింసావాదిని ఎదుర్కోవాలంటే శత్రువు చెడ్డవాడయినప్పటికీ…కలవక తప్పదన్నారు పవన్ కల్యాణ్. ఇదంతా ఎన్నికల వ్యూహంలో భాగమేనన్నారు. టీడీపీకి తనతో అవసరం ఉన్నప్పటికీ…పొత్తు అనేది ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలని…లేదంటే పొత్తుకు అర్థమే ఉండదనేలా పవన్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు…ఏపీ రాజకీయాల్లో ఆసక్తిరేపుతున్నాయ్. అసలు జనసేనాని అలా ఎందుకు మాట్లాడారు? కేవలం పాసింగ్ రిమార్క్ ఇవ్వడానికి ఆ వ్యాఖ్యలు చేశారా? లేక పాతమిత్రుడికి వార్నింగ్ ఇచ్చారా ? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.