ఏపీలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కటీఫ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న మాదిరిగా ఈ రెండు పార్టీల సాన్నిహిత్యం ఉంది. ఏపీలో గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నిక, బద్వేలు ఉప ఎన్నిక, ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన దాఖలాలు కనిపించలేదు. అయితే బహిరంగ సభలలో బీజేపీ గురించి ప్రస్తావించడం తప్పితే బీజేపీతో సన్నిహిత సంబంధాల గురించి కూడా పవన్ మాట్లాడింది తక్కువే.
మరోవైపు ఇటీవల ఏపీలో ప్రధాని మోదీ టూర్‌కు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు హాజరుకావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు. కారణాలు ఏవైనా ప్రధాని టూర్లో పవన్ పాల్గొనలేదు. దీంతో బీజేపీ, జనసేన పొత్తుపై అందరిలోనూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. తాజాగా జరిగిన ఘటన ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. జూలై 22న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి రావాలని పవన్‌ను బీజేపీ ఆహ్వానించింది. అయితే పవన్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండటంతో ఈ కార్యక్రమానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. దీంతో బీజేపీపై పవన్ అలిగారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అంతకుముందు ఈ ఏడాది మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తాను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే నెలలు గడిచిపోయినా ఇప్పటివరకు బీజేపీ ఎలాంటి రోడ్ మ్యాప్‌ను జనసేనకు అందించిన దాఖలాలు లేవు.
తాజా పరిణామాలన్నీ గమనిస్తే బీజేపీ నుంచి పవన్ దూరమయ్యేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. అటు బీజేపీని వదిలి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో జత కట్టాలని పవన్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల జనసేన సభలో పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లను జనసైనికులకు వెల్లడించారు. బీజేపీ-టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదా కేవలం బీజేపీతో కలిసి పోటీ చేయడం లేదా ఒంటరిగా పోటీ చేయడం అని పవన్ తన మూడు ఆప్షన్లను బహిరంగంగానే ప్రకటించారు. ఈ మూడు ఆప్షన్లు కాకుండా కేవలం టీడీపీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తారా లేదా ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ తన సత్తా నిరూపించుకుంటారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.