వైఎస్‌ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్‌.. బీజేపీలో జోష్‌.. షాక్‌లో టీఆర్ఎస్‌..!

0
466

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయడంతో… అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలకు తెరపైకి వచ్చాయి.. వైఎస్‌ షర్మిలకు ఫోన్‌ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆమెను పరామర్శించారని తెలుస్తోంది.. ఇటీవల జరిగిన ఘటనలు, ఆమెపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు.. అరెస్ట్, కారులో ఉండగానే క్రేన్‌తో పీఎస్‌కు తరలించడం, పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి తదితర అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం.. వైఎస్‌ షర్మిలకు సానుభూతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. ఇదే సమయంలో.. అరెస్ట్‌ చేసినా ఏ మాత్రం బెదరకుండా ధైర్యంగా వ్యవహరించారని ఆమెను ప్రశంసించారని ప్రచారం సాగుతోంది.. దాదాపు 10 నిమిషాల పాటు వైఎస్‌ షర్మిలతో ప్రధాని మోడీ మాట్లాడారని చెబుతున్నారంటే.. ఇంకా అనేక విషయాలే చర్చకు వచ్చిఉంటాయి అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది..

వరంగల్‌ ఘటన, అరెస్ట్‌ తర్వాత వైఎస్‌ షర్మిల రాజ్‌భవన్‌కు వెళ్లడం.. గవర్నర్‌ తమిళిసైని కలిసినప్పటి నుంచి ఆమెపై విమర్శలు మొదలయ్యాయి… ఓ వైపు సోషల్‌ మీడియాలో.. మరోవైపు అధికార టీఆర్ఎస్‌ పార్టీ నుంచి షర్మిలను టార్గెట్‌ చేసి విమర్శలు గుప్పించారు.. ఇప్పుడు అర్థమైపోయింది.. షర్మిల ఎవరు వదిలిన బాణమో అంటూ మండిపడ్డారు.. ముమ్మాటికి షర్మిల.. భారతీయ జనతా పార్టీ వదిలిన బాణమే అంటూ ఆరోపణలు గుప్పించారు.. ఇక, పాదయాత్రలో షర్మిలపై జరిగిన దాడి ఘటనపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలకు కూడా స్పందించారు. షర్మిలపై జరిగిన దాడి, పోలీసులు తీరును ఖండించారు. ఇదే సమయంలో.. షర్మిల వ్యవహారంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కూడా ఉదాహరణగా చూపుతూ వచ్చారు టీఆర్ఎస్‌ నేతలు.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో.. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీయే వైఎస్‌ షర్మిలకు ఫోన్‌ చేయడం చర్చగా మారింది.. ఇది పరామర్శల వరకే పరిమితం అయ్యిందా? మోడీ ఫోన్‌ కాల్‌ వెనుక ఇంకా ఏదైనా మతలాబు ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు, తనకు ఫోన్‌ చేసి పరామర్శించిన ప్రధాని మోడీకి వైఎస్‌ షర్మిల ధన్యవాదాలు తెలిపారు.. ప్రధాని ఫోన్ చేసిన విషయంపై ఆమె స్పందిస్తూ.. థ్యాంక్యూ మోదీ జీ.. ఒక మోడీ మాత్రమే కాదు ఎంతో మంది స్పందించారని చెప్పుకొచ్చారు.. ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకోవడం, ఇలా అరెస్ట్ చేయడం అన్యాయమని చాలా మంది సానుభూతి వ్యక్తం చేశారన్నారు.. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ శిబిరంలో కొంత సానుకూలత కనిపిస్తుంటే.. ప్రధాని మోడీ ఫోన్‌ చేయడం ఏంటి? అని ఆరా తీసేపనిలో అధికార టీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ ఫోన్‌ చేయడం.. టీఆర్ఎస్‌ నేతలకు షాకే అంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here