తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడుతుందా..? ముందుకు సాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.. ఆపాలంటూ ఓవైపు పోలీసులు నోటీసులు ఇస్తే.. మరోవైపు ఆపేది లేదు.. నిర్వహించి తీరుతాం అంటున్నారు బీజేపీ నేతలు.. దీంతో.. ఏం జరుగుతుంది? అనేది ఉత్కంఠగా మారింది.. ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.. పాదయాత్ర ప్రముఖ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు నోటీసులు జారీ చేసిన వర్దన్నపేట ఏసీపీ తెలిపారు.. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు.. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని.. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని.. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని స్పష్టం చేశారు.. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
బీజేపీ నేతలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదంటున్నారు.. పోలీసులు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్జ.. పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నాం అన్నారు.. అప్పుడు లేని అభ్యంతరాలు… ఇప్పుడెందుకు? అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా… ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు.. అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తాం.. ఈనెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతాం.. పాదయాత్ర ముగింపుకు సభకు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారని తెలిపారు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్. ఓవైపు పోలీసుల నోటీసులు.. మరోవైపు బీజేపీ నేతల ప్రకటనల నేపథ్యంలో.. పాదయాత్రకు బ్రేక్ పడుతుందా? ముందుకు సాగుతుందా? పాదయాత్ర ముందుకు సాగితే పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.