ఇంద్రకీలాద్రి పై ఏపీ డిప్యూటీ సీఎంకు అవమానం జరిగింది. దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. అయితే.. ఆలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు ఆలయ మర్యాదలు కూడా దక్కలేదు. అయితే.. అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక దర్శనం ద్వారం వద్దకు వెళ్లగానే.. గేట్లకు తాళాలేసేశాం…క్యూలైన్లో దర్శనాలకు వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సమాధానం చెప్పారు. అయితే.. అనుమతి నిరాకరించటంతో అక్కడే కొద్దీ సేపు డిప్యూటీ సీఎం వేచి వున్నారు.
అనంతరం.. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో భ్రమరాంబ దగ్గరుండి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడిని దర్శనానికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే.. ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయ స్థానాచార్య, ప్రధానార్చకులను అడ్డుకున్నారు పోలీసులు. డ్యూటీ పాస్ చూపించినప్పటికీ దురుసుగా ప్రవర్తించారు. నీకు నచ్చింది చేసుకో అంటూ దురుసుగా వ్యవహరించారు పోలీసులు. దీనిపై అర్చకులు మండిపడుతున్నారు. సెక్యూరిటీ పేరుతో పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.