మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరంతో భద్రాచలానికి ముంపు ముప్పు వుందన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. భద్రాచలం ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామని చెప్పారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ఆ ఐదు గ్రామాలు దూరంగా ఉంటాయని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.
పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదలడం ఆలస్యం కావడం వల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని చెప్పారు. భద్రాచలానికి ఇరువైపులా కరకట్టలను కట్టించేందుకు..ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. వెయ్యి కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారని, ఇందుకు ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున కృతజ్ఞతలు తెలిపారు. వర్షం పడుతున్నా.. వరద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని..దీనిపై మొదటి నుంచి నిరసన తెలుపుతున్నామన్నారు మంత్రి పువ్వాడ అజయ్. వరదల నుంచి గిరిజనులను కాపాడుకోగలిగామని చెప్పారు. త్వరలో వరద సాయం బాధితుల ఖాతాల్లో చేరుతుందని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఏపీ నుంచి కూడా ముంపు బాధితులు వచ్చి తమ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని మంత్రి గుర్తు చేశారు.