రైల్వేశాఖ తీసుకున్న ఓ నిర్ణయం గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది.. సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీని రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం సమకూరింది. రాయితీ రద్దు మూలంగా గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,242 కోట్లు అదనంగా ఆర్జించినట్లు రైల్వే శాఖ పేర్కొంది.. ఆర్టీఐ దరఖాస్తుకు జవాబిస్తూ రైల్వే శాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.. అయితే, కరోనా మహమ్మారీ ఎంట్రీ తర్వాత.. దేశంలో పరిస్థితి మారిపోయింది.. వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది.. అదే సమయంలో రైల్వే శాఖ వృద్ధులకు ఇచ్చే టికెట్ రాయితీని ఎత్తేసింది. గతంలో రాయితీలో భాగంగా 60 ఏళ్లు పైబడిన పురుషులకు టికెట్ ధరలో 40 శాతం, 58 ఏళ్లు పైబడిన మహిళలకు టికెట్ ధరపై 50 శాతం మినహాయింపు కల్పించింది.
ఇక, లాక్‌డౌన్ సమయంలో ఎత్తివేసిన రాయితీని ఇప్పటి వరకూ పునరుద్ధరించలేదు రైల్వే శాఖ.. అదే ఇప్పుడు రైల్వేకు భారీ మొత్తంలో అదనపు ఆదాయం సమకూర్చుతోందని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.. సీనియర్ సిటిజన్లకు అమ్మిన టికెట్లతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.5,062 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే శాఖ పేర్కొంది.. ఇందులో సీనియర్ సిటిజన్లయిన పురుషుల నుంచి రూ.2,891 కోట్లు, మహిళల నుంచి రూ.2,169 కోట్లు, ట్రాన్స్ జెండర్ల నుంచి రూ.1.03 కోట్లు వచ్చాయని.. మొత్తంగా టికెట్లపై రాయితీ రద్దుతో రైల్వేకు రూ.2,242 కోట్ల అదనపు ఆదాయం వచ్చినట్టు తెలిపారు.. అయితే, సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలంటూ వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్లింది వ్యవహారం.. కానీ, ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. కొట్టివేసిన విషయం విదితమే.