టాలీవుడ్ ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు..హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు కృష్ణంరాజు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు.. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కేంద్ర మంత్రిగా పని చేసిన కృష్ణంరాజు తెలుగు సినీరంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు కృష్ణంరాజు. హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు కుటుంబసభ్యులు.
రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతికి సంతాపం తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్. యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటన్న సీఎం కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్.
తెలుగు చిత్రసీమలో స్టార్ డమ్ కోసం దాదాపు పుష్కరకాలం ప్రయత్నాలు సాగించి, విజేతలుగా నిలచినవారు ఇద్దరే ఇద్దరు- వారు శోభన్ బాబు, కృష్ణంరాజు. ఈ ఇద్దరు హీరోలను అప్పట్లో యన్టీఆర్, ఏయన్నార్ బాగా ప్రోత్సహించారు. వారిచిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తూ తమ ఉనికిని చాటుకున్నారు. అయినా స్టార్ డమ్ చేరుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. శోభన్ బాబు హీరోగా, సైడ్ హీరోగా, కేరెక్టర్ యాక్టర్ గా సాగుతూ చివరకు `తాసిల్దార్ గారి అమ్మాయి`తో స్టార్ డమ్ చూశారు. అయితే కృష్ణంరాజుకు హీరోవేషాలు అంతగా దక్కలేదు. అయినా కృష్ణంరాజు నిరాశ చెందలేదు. తనకు లభించిన విలన్ రోల్స్ లోనూ అద్భుతంగా నటించి మెప్పించారు.
ఆ రోజుల్లో కృష్ణంరాజును విలన్ గా తెరపై చూసిన మహిళా ప్రేక్షకులు ఆయన పేరు చెప్పగానే జడుసుకొనేవారు. అలాంటి కృష్ణంరాజు ఆ ముద్ర నుండి బయట పడడానికి `కృష్ణవేణి, అభిమానవంతులు, మేమూ మనుషులమే` వంటి చిత్రాలలో సాఫ్ట్ కేరెక్టర్స్ పోషించారు. ఈ చిత్రాలలో`కృష్ణవేణి` మినహా ఏ చిత్రమూ విజయం సాధించలేదు.అయినా మెల్లగా కృష్ణంరాజును కూడా హీరోగా చూడడానికి జనం అలవాటు పడేలా చేసుకున్నారు. ఆ తరువాత `భక్త కన్నప్ప`తో నటునిగా జనం మెదిని మెప్పించడమే కాదు, స్టార్ డమ్ నూ సొంతం చేసుకున్నారు. `అమరదీపం` చిత్రంతో నంది అవార్డుల్లో తొలి ఉత్తమనటునిగా నిలిచారు.
ఆ పై మాస్ సినిమాలతోనూ ఆకట్టుకోవడం మొదలెట్టారు. దాసరి నారాయణరావు రూపొందించిన “కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ“ చిత్రాలు కృష్ణంరాజును `రెబల్ స్టార్`గా నిలిపాయి. ఆ తరువాత నుంచీ ఆయన మరి వెనుదిరిగి చూసుకోలేదు. ఇలా కృష్ణంరాజు సినీప్రయాణం తరువాతి రోజుల్లో ఎందరో హీరోలకు స్ఫూర్తిగా నిలచింది. కృష్ణంరాజు స్ఫూర్తితోనే చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్ వంటివారు తొలుత చిన్న వేషాలు, విలన్ రోల్స్ చేసినా తరువాత హీరోలుగానూ, అటుపై స్టార్స్ గానూ రాణించారు. ఆ తీరున ప్రస్తుతం చిత్రసీమలో ప్రవేశిస్తున్న ఎందరో నటులకు కృష్ణంరాజు చలనచిత్ర జీవితం ప్రేరణగా నిలచిందని చెప్పవచ్చు.