ఎస్బీఐ బ్యాడ్‌ న్యూస్‌… పెరిగిన ఈఎంఐల భారం..

0
682

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది.. బేస్‌ రేటును, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్‌ఆర్‌)ను 70 బేసిస్ పాయింట్లు పెంచినట్టు ప్రకటించింది.. ఎస్బీఐ తాజా నిర్ణయంతో బీపీఎల్ఆర్ రేటు అత్యధికంగా 13.45 శాతానికి చేరింది.. ఇక, బేస్ రేటు 8.7 శాతానికి పెరిగింది… దీంతో, బీపీఎల్‌ఆర్‌తో లింకైన రుణాల చెల్లింపులన్ని మరింత భారం కానున్నాయి… జూన్‌లో సమీక్షించిన సమయంలో బీపీఎల్ఆర్ రేటు 12.75 శాతంగా ఉండేది.. ఇప్పటి వరకు అదే అమల్లో ఉండగా… తాజా సవరణతో అది కాస్తా 13.45 శాతానికి చేరింది.. సమీక్షించిన వడ్డీ రేట్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నట్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్బీఐ పేర్కొంది.

ఇక, బేస్ రేటు 8.7 శాతానికి పెంచడంతో.. బేస్ రేటుపై రుణాలు తీసుకున్న వారందరికీ ఈఎంఐలు మరింత భారం కాబోతున్నాయి.. బేస్ రేటుతో రుణాలు తీసుకున్న రుణగ్రహీతలకు ఈఎంఐ మొత్తం పెరుగుతుంది. బ్యాంకులు రుణాలను పంపిణీ చేయడానికి ఉపయోగించే పాత బెంచ్‌మార్క్‌లు ఇవి. ఇప్పుడు చాలా బ్యాంకులు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్‌ఆర్‌) లేదా రెపో-లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్‌ఎల్ఎల్ఆర్‌)పై రుణాలు అందజేస్తున్నాయి. బ్యాంక్ బీపీఎల్‌ఆర్‌ మరియు బేస్ రేటు రెండింటినీ త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంది. ఎస్‌బీఐ రుణ రేట్ల సవరణ చేసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులు కూడా దీనినే అనుసరించే అవకాశం ఉంది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశానికి ముందు బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ల పెరుగుదలతో.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.. షెడ్యూల్ ప్రకారం, తదుపరి ద్రవ్య విధాన సమావేశం సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది.. మరి ఆ సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here