విచారణకు రానివారిపై ఫోకస్‌ పెట్టిన సిట్‌.. ఎప్పుడైనా అరెస్ట్‌..?

0
951

టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ నిందితులు దొరికిపోయిన కేసులో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఈ కేసులో, ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్‌ ఇప్పటికే హల్‌ చల్‌ చేస్తోంది.. దేశంలోని అన్ని కోర్టులకు, వ్యవస్థలకు, పార్టీలకు, ప్రముఖులకు సైతం.. ఆ వివరాలను పంపించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మరోవైపు.. ఈ కేసును పూర్తిస్థాయిలో తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)ను ఏర్పాటు చేశారు.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషన్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ దర్యాప్తులో దూకుడు చూపిస్తోంది.. ఈ కేసులో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సన్నిహితుడిగా చెబుతున్న న్యాయవాది శ్రీనివాస్‌ను విచారించింది సిట్‌.. ఎనిమిది గంటల పాటు శ్రీనివాస్ ను సుదీర్ఘంగా ప్రశ్నించారు సిట్ అధికారులు.. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్, ఎస్‌హెచ్‌వో మోహినాబాద్ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌ విచారణ కొనసాగింది..

ముఖ్యంగా సింహయజీ స్వామికి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలుపై శ్రీనివాస్‌ను ప్రశ్నించింది సిట్.. అక్టోబర్ 26 తిరుపతి నుండి హైదరాబాద్ కు సింహయజీ స్వామికి టికెట్స్ ఎందుకు బుక్ చేసారని ఆరా తీశారు.. ఇక, శ్రీనివాస్ కాల్ డేటా, వాట్సాప్ మెసేజ్‌లను ముందు ఉంచి ప్రశ్నించింది సిట్‌.. అసలు, ఎవరు చెబితే ఫ్లైట్ టికెట్స్ కొనుగోలు చేశారని ఆరా తీశారు.. అయితే, సింహయజీ స్వామితో పూజ చేయించడానికి మాత్రమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశామని శ్రీనివాస్‌ సిట్‌కు తెలిపారట.. సింహయాజీతో హోమం, మరికొన్ని పూజలు జరిపించాలని అనుకున్నాను.. అందుకే టికిట్స్‌ బుక్‌ చేసినట్టు వివరణ ఇచ్చారని సమాచారం. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దూకుడు చూపిస్తోంది.. అయితే, విచారణకు కొందరు కీలక నేతలు డుమ్మా కొడుతున్నారు.. ఈరోజు విచారణకు హాజరు కానీ బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు సిట్ అధికారులు… విచారణకు రానివారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సమాలోచనలు చేసి.. చర్యలకు సిద్ధమవుతోంది.. రేపు ఈ వ్యవహారంలో హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో.. ఆ తర్వాతే చర్యలకు సిద్ధం అవుతోందట సిట్‌ టీమ్.. మరి.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌కి నోటీసులు జారీ చేసిన సిట్‌.. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్‌ చేస్తామని పేర్కొన్న విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here