ఏపీలో భారీవర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నిండుకుండని తలపిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి భారీగా వరదనీరు పోటెత్తుతుంది.ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి ఇన్ ఫ్లో 11893 క్యూసెక్కులు వస్తూ ఉంది. జలాశయ పూర్తి సామర్థ్యం 78 టిఎంసిల కాగా ప్రస్తుతం 73 టిఎంసిలు వరద వచ్చి చేరుకోంది. అటు పెన్నా పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఇవాళ సాయంత్రం లోపు ఏ క్షణమైన జలాశయ గేట్లను ఎత్తివేసి నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
గత ఏడాది వచ్చిన వరదలకు జలాశయం ముందు ఉన్న ఆప్రాన్ ప్రాంతం మొత్తం పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం 100 కోట్ల నిధులతో ఆప్రాన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు వరద ఎక్కువైతే పనులకు ఆటంకం కలగడమే కాకుండా జలాశయ సంపదకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద ప్రవాహంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రాత్రి లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం వుందని విపత్తుల సంస్థ ఎండీ డా. బి ఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 1.18 లక్షల క్యూసెక్కులుగా వుంది. గణేష్ నిమజ్జనాల దృష్ట్యా అధికారుల అలెర్ట్ అయ్యారు. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో … 3లక్షల 30వేల 738 క్యూసెక్కులుగా వుంది. 14గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.
వరద పెరిగే కొద్ది ముంపు గురికాబోయే ప్రభావిత ప్రాంత అధికారులు అప్రమత్తం కావాలని ఆయన సూచించారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు. ఇటు నాగార్జున సాగర్ కు కూడా వరద ప్రవాహం పెరిగింది. ఎడమకాలువకు గండి పడింది. శ్రీశైల జలాశయానికి భారీగా పెరుగుతున్న వరదతో అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీశైలం జలాశయం 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
ఇన్ ఫ్లో : 3,50,341 క్యూసెక్కులుగా వుండగా.. ఔట్ ఫ్లో : 3,14,293 క్యూసెక్కులుగా వుంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగులుగా వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు అయితే ప్రస్తుతం 214.8450 టీఎంసీలుగా వుంది. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కర్నూలు జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు నగరంతోపాటు నంద్యాల, మిడుతూరు లో భారీ వర్షం కురిసింది. ఆలూరు, ఆత్మకూరు, పత్తికొండ,నందికొట్కూరు,జూపాడుబంగ్లా, పగిడ్యాల, డోన్ ప్రాంతాల్లో తేలికపాటి, ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి ఆలూరు లో మట్టి మిద్దెకూలి ఇంద్రమ్మ(30) అనే మహిళ మృతి చెందగా కూతురు పరిస్థితి విషమంగా ఉంది. బాలికను ఆదోని ఆసుపత్రికి తరలించారు. రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డారు. హోళగుంద మండలం మార్లమడికి సమీపంలో వేదవతి నది పొంగి ఆంధ్ర, కర్ణాటక రాకపోకలకు అంతరాయం కలిగింది.