తెలంగాణలో మళ్ళీ స్వైన్ ఫ్లూ.. వైద్యారోగ్యశాఖ అలర్ట్

0
706

మూడేళ్ళ తర్వాత మళ్ళీ స్వైన్ ఫ్లూ సంకేతాలు వైద్యారోగ్యశాఖకు కలవరం కలిగిస్తున్నాయి. గత రెండు వారాలుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ కేసుల పెరుగుదల నమోదైంది. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయింది. స్వైన్ ఫ్లూ (H1N1 Virus) కేసులు సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువగా బయటపడుతుంటాయి. ఆస్పత్రుల్లో ఈ కేసుల తీవ్రత క్రమేపీ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. .

నారాయణ గూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) కి వస్తున్న శాంపిల్స్ ని పరిశీలిస్తే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న సంగతిని డాక్టర్లే నిర్దారిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సి. శివలీల 2021, 2020లో ఎలాంటి నమూనాలు పంపలేదని, ఇప్పుడు నమూనాలు అందుతున్నాయని, నమూనాల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా శాంపిల్స్ ఐపీఎంకి చేరాయి. 15 రోజుల క్రితం గ్లోబల్ ఆస్పత్రికి కొన్ని శాంపిల్స్ వచ్చాయని డాక్టర్లు తెలిపారు. స్వైన్ ఫ్లూకి సంబంధించిన లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపించాయి. తలనొప్పి, దగ్గు, జలుబు, కడుపులో నొప్పి, విరేచనాలు కనిపించాయి. కోవిడ్ కి సంబంధించి నెగిటివ్ నివేదికలు వచ్చాయి. అయితే వీరికి బ్యాక్టీరియల్ న్యూమోనియా నిర్దారణ అయింది. డాక్టర్లు వీరికి స్వైన్ ఫ్లూ లక్షణాలు వున్నాయని అనుమానిస్తున్నారు.

అలజడి రేపిన కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు హెచ్‌1ఎన్‌1 వ్యాప్తిని కూడా నిరోధించినట్లుగా వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లూ వ్యాక్సిన్‌ హెచ్‌1ఎన్‌1కు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అయితే దీన్ని ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఐపీఎంకి రోజూ ఐదారు శాంపిల్స్ వస్తున్నాయని, అయితే రోగుల్ని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోవడం లేదన్నారు. పూర్తి నిర్దారణకు వచ్చాకే రోగులకు జాగ్రత్తలు చెబుతామన్నారు. పాఠశాలలు కూడా ప్రారంభం కావడంతో పిల్లలు జ్వరం, డయేరియా, కడుపునొప్పి వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసుల తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ నుంచి వచ్చిన శాంపిల్స్ లో హెచ్ 1 ఎన్ 1 వైరస్ వుందని తేలింది. వైరల్ ఫీవర్స్ కూడా అక్కడ పెరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here