“తెలంగాణ బీజేపీకి తక్షణం లీడర్లు కావలెను” అంటే ఇప్పుడు లీడర్లు లేరని కాదు. ఉన్నారు. కానీ సరిపోను సంఖ్యలో లేరు. రాష్ట్రంలో చాలా చోట్ల పోటీకి నిలబడేందుకు ఆ పార్టీకి ప్రజాదరణ కలిగిన, బలమైన నాయకులు కనిపించట్లేదు. అసలే తెలంగాణలో వచ్చే (2023) అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ముందుగా ఈ సమస్యను అధిగమించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే దీనిపై దృష్టిపెట్టింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాయకత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది.
ఇందులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, ఎ.చంద్రశేఖర్, డి.ప్రదీప్ కుమార్‌లను సభ్యులుగా నియమించింది. రాజకీయ పార్టీలతో సంబంధంలేని తటస్థులను, విద్యావేత్తలను, ఇతర రంగాల వారిని, వేరే పార్టీలతో అనుబంధం ఉన్నా అవినీతి ఆరోపణలు, నేర చరిత్ర లేని నాయకులను కమలదళంలోకి ఆకర్షించటమే ఈ కమిటీ పని. ఇలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్నోళ్లకు బేషరతుగా పార్టీలోకి స్వాగతం చెబుతారు.
తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్ ఇవాళ హైదరాబాద్ వచ్చి ఈ కమిటీతో భేటీ కానున్నారు. ప్రస్తుతానికి ఎవరెవరు పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారో ఆ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతాల పైన, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పైన ఆసక్తి ఉన్న అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఈ చేరికలను, వలసలను ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సహించనున్నారు. ఎందుకంటే కాషాయం పార్టీకి రూరల్ ఏరియాల్లో నాయకత్వ లోపం నెలకొంది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని తెలంగాణ బీజేపీ సీనియర్ లీడర్ ఒకరు చెప్పారు. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ, మరో వైపు టీఆర్‌ఎస్ పార్టీ సైతం “ఆపరేషన్ ఆకర్ష్”ను ముమ్మరం చేశాయి. దీంతో కారు పార్టీ ఇప్పటికే హౌజ్‌ఫుల్ అయినట్లు కనిపిస్తోంది. కాబట్టి అక్కడ కొత్తవాళ్లను చేర్చుకునే అవకాశంలేకపోవటంతో పలువురు టీఆర్‌ఎస్ లీడర్లు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారు. సరైన సందర్భం రాగానే జంప్ చేస్తామని, ఒకవేళ తాము రాకపోయినా తమ కుటుంబ సభ్యులను పంపిస్తామని చెబుతున్నట్లు టాక్.
కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది ఇదే వ్యూహాన్ని పాటిస్తున్నారని చెబుతున్నారు. నిజానికి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లేని వ్యక్తులు వస్తేనే బీజేపీకి ప్రయోజనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారిపై ఎలాంటి ఆరోపణలు ఉండవు. కాబట్టి ప్రత్యర్థి పార్టీలు విమర్శించే ఛాన్స్ ఉండదు. ఇది కమలం పార్టీ విజయావకాశాలను పెంచుతుంది. మచ్చలేని వ్యక్తులపై ఎన్నికల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన పని ఉండదు. వాళ్ల పాజిటివ్ ఇమేజే ఓటర్లను ఆలోచింపజేస్తుంది. తద్వారా పార్టీకి ఖర్చు కూడా తగ్గుతుంది. కొత్తవాళ్లైతే నూతన ఆలోచనలు చేస్తారు. పార్టీకి అన్ని విధాలా పనికొస్తారు. కుమ్ములాటలు, గ్రూప్ పాలిటిక్స్‌కి పాల్పడరు. అందుకే తెలంగాణ బీజేపీకి తక్షణం ఇలాంటి నేతలు కావలెను.