ప్రభుత్వ మాజీ విప్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తరహాలోనే ఏపీలో కూడా త్వరలో అధికార మార్పిడి జరగబోతుందని జోస్యం చెప్పారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వం వహించబోతున్నారని తెలిపారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరచాలని ఏ జాతీయ పార్టీ అయినా ఆలోచిస్తుందని.. అందుకే ఏపీలో అధికార మార్పిడికి బీజేపీ సహకరిస్తుందని ఆరోపించారు. సోమవారం జరిగిన గడప గడపకు రివ్యూ మీటింగులోనే చాలా మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారని కూన రవికుమార్ వ్యాఖ్యానించారు.
అటు రాష్ట్ర ప్రజలతో సీఎం జగన్ వెటకారంగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత కూనరవికుమార్ ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని జగన్ చెప్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. జగన్ ప్రభుత్వానికి దమ్ముంటే టీడీపీ హయాంలోని లబ్ధిదారుల సంఖ్య, నేటి లబ్దిదారుల సంఖ్య బహిర్గతం చేయాలన్నారు. 2లక్షల 99వేల 85 మందికి పెన్షన్లు ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ బటన్ నొక్కడంతో సాక్షి పత్రికకు లాభం చేకూరుతూ ప్రజలకు లబ్ది మాత్రం శూన్యమనేది జగమెరిగిన సత్యమన్నారు. జగన్ అధికారంలోకి రాకముందు రూ.3వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని మండిపడ్డారు. రూ.200 ఉన్న పెన్షన్ రూ.2వేలు చేసిన ఘనత టీడీపీదే అన్నారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ కలిసి రూ.625 పెన్షన్ పెంచితే.. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి పెన్షన్ రూ.1875 పెంచారని కూన రవి వివరించారు.