వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శలు చేశారు. పంటల బీమా పథకం మొత్తం లోపభూయిష్టమేనని.. జగనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించాడని.. దానికి అర్హత, ఆథరైజేషన్ వ్యాలిడిటీ ఏమీ లేవని ఆరోపించారు. రైతులకు పంటల బీమా ప్రీమియం ఎంత కట్టారో ప్రభుత్వం తెలపాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకంతో రైతులు నష్టపోయి, పార్టీ నాయకులు, మద్దతుదారులు లాభపడుతున్నారని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. లేని ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికంగా పంటలు వేసిన ప్రాంతానికి పంటల బీమా చెల్లించకపోవడం దారుణమన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన పంటకు తక్కువ బీమా ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రజా ధనాన్ని, రాష్ట్ర ఆదాయాన్ని తన మద్దతుదారులకు పంటల బీమా రూపంలో దోచిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. గతంలో ఉన్న ధరల స్థిరీకరణ పథకానికి రెక్కలొచ్చాయని.. జగన్ రైతుల పక్షపాతి కాదు.. కక్షపాతి అని విమర్శించారు. అమ్మఒడి పథకానికి లేనిపోని నిబంధనలు పెట్టి అవకతవకలకు పాల్పడుతున్నారని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.