టీ20 ప్రపంచకప్‌ జట్టులో బుమ్రా, హర్షల్ పటేల్ ఉంటారా?

0
922

ఆసియా కప్‌లో అక్కర్లేని ప్రయోగాలు చేసి టీమిండియా బొక్కబోర్లా పడింది. కనీసం ఫైనల్ చేరకుండా అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో ఎవరిని తీసుకుంటారు అన్న విషయం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లన్నీ టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును ప్రకటించాయి. టీమిండియా కూడా ఈనెల 16న జట్టును ప్రకటించనుంది. టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే జట్టు వివరాలను అందజేయడానికి సెప్టెంబర్ 16వ తేదీని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. అందుకే భారత సెలెక్షన్ కమిటీ అదే రోజు సమావేశమై జట్టును ప్రకటించనుంది.

ఆల్‌రౌండర్ జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరం కావడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా లేదా దీపక్ హుడాకు అవకాశమిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు స్టార్ పేస్ బౌలర్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక అవుతాడా లేదా అన్న విషయం ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ మేరకు బుమ్రా, హర్షల్ పటేల్‌కు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. వాళ్ల గాయాలపై స్పష్టత రాగానే జట్టును ప్రకటిస్తామని సెలక్షన్ కమిటీ చెప్తోంది. బుమ్రా వెన్ను నొప్పి గాయంతో.. హర్షల్ పటేల్ పక్కటెముకల గాయంతో ఆసియా కప్‌కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం హర్షల్ పటేల్ కోలుకున్నట్లు కనిపిస్తున్నా.. బుమ్రా గాయంపైనే అనుమానాలు నెలకొన్నాయి. ఆసియా కప్‌లో బౌలింగ్ వైఫల్యం వల్లే టీమిండియా ఫైనల్‌కు చేరలేదని అభిమానులు భావిస్తున్నారు. బుమ్రా, షమీ, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్ వంటి బౌలర్లు లేకపోవడం పెద్ద లోటుగా ఏర్పడిందని అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here