తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన, వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైన ఓ సంస్థ చేసిన అధ్యయన ఫలితాలు తాజాగా వెలువడటంతో ఇప్పుడు అందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో విపక్ష పార్టీలు ఇంకాస్త తెలివిగా వ్యవహరిస్తే అధికారానికి దగ్గరగా రావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గానీ బీజేపీ గానీ గుడ్డిగా టీఆర్‌ఎస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకుండా వాటిలోని లోటుపాట్లను ప్రజలకు సమర్థంగా పట్టిచూపాలి. ముఖ్యంగా సర్కారు అమలుచేస్తున్న వివిధ పథకాల్లోని లోపాలను పాయింటౌట్ చేయాలి.
ఉదాహరణకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీమ్‌లని తీసుకుంటే ఇది పేదలకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఒకప్పుడు పేదోళ్లు ఆడపిల్ల పెళ్లి చేస్తే గవర్నమెంట్ నయా పైసా కూడా ఇచ్చేది కాదు. ఇవ్వాలనే రూలేమీ లేదనుకోండి. అది వేరే విషయం. కాకపోతే సీఎం కేసీఆర్ ఏడెనిమిదేళ్లుగా ఈ పథకాలను అమలుచేస్తున్నారు. దీంతో ఎంతో మంది ప్రయోజనం పొందుతున్నారు. కాబట్టి కేసీఆర్‌ని గద్దె దించాలని పిలుపునిస్తే పేద ప్రజల నుంచి ప్రతికూల స్పందన రావొచ్చు. కాబట్టి ఈ పథకాల కింద మరిన్ని డబ్బులు ఇస్తామని ప్రకటించినా జనం స్వాగతించే అవకాశం ఉంది.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ డబ్బులను పెంచటం వల్ల ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతుందనుకుంటే ప్రతిపక్షాలు తమ ఎన్నికల ప్రచారంలో అసలు ఆ పథకాల జోలికే వెళ్లకపోవటం మంచిది. ఇక రైతుబంధు సంగతి చూద్దాం. ఈ పథకం కింద ఎన్ని ఎకరాల భూమి ఉన్నా లిమిట్ అనేదే లేకుండా ప్రభుత్వం డబ్బులిస్తోంది. దీంతో లక్షాధికారులు, కోటీశ్వరులు సైతం లబ్ధిపొందుతున్నారు. వాస్తవానికి వాళ్లకు ఈ పంట పెట్టుబడి సాయం అవసరంలేదు. అందువల్ల మాకు ఓటేసి గెలిపిస్తే రైతుబంధుకు పరిమితి విధిస్తామని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ప్రకటించొచ్చు.
ప్రజాధనం వృధా కాకుండా అరికడతామని హామీ ఇవ్వొచ్చు. టీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలుకాలేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీని విడతల వారీగా కాకుండా ఒకేసారి అమలుచేస్తామని మాట ఇవ్వొచ్చు. దళితబంధు పథకంలోని మైనస్ పాయింట్లను పబ్లిక్‌కి వివరించొచ్చు. నిరుద్యోగ భృతి ఇవ్వటం ఇంకా ప్రారంభించలేదు కాబట్టి మేమొస్తే వెంటనే ఇస్తామని నమ్మకం కలిగించటానికి ప్రయత్నించాలి. ఇంకేమైనా కొత్త పథకాలను ఆరంభిస్తామని ఆశపెట్టొచ్చు.
అంతేగానీ సీఎం కేసీఆర్‌ని కుర్చీ దించేస్తాం.. ఆయన్ని జైలుకు పంపిస్తాం.. అంటూ యాంటీ (తెలంగాణ) సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దు. ఎందుకంటే ఏ పాలకుడినైనా కుర్చీ దించాల్సింది ప్రజలే. ప్రతిపక్ష నాయకులు కాదు (ఏక్‌నాథ్ షిండేలాంటోళ్లను వదిలేయండి). కాబట్టి వాస్తవ దూరమైన వ్యాఖ్యలు చేయకూడదు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రజలు ఆలోచించి ఓటేస్తున్నారనే సంగతిని అపొజిషన్ పార్టీలు మరవొద్దు. అందిరానున్న సదవకాశాన్ని అనవసర విమర్శలతో ఆగం చేసుకోవద్దని పొలిటికల్ అనలిస్టులు సూచిస్తున్నారు.