Telangana BJP: రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) యాక్ట్.. సమాచార హక్కు చట్టం. తెలంగాణ బీజేపీ ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా మలచుకోబోతోంది. ప్రభుత్వ శాఖల నుంచి తమకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని సేకరించనుంది. తద్వారా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ని టార్గెట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 88 ఆర్టీఐ అప్లికేషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులతోపాటు మరిన్ని వివరాలను కోరారు. ఆయన చేసిన పనిని బీజేపీ కేంద్ర నాయకత్వం మెచ్చుకుంది. బండి బాటలో ఇక ప్రతి గ్రామంలోనూ ఈ ఆర్టీఐ పంచాయితీ పెట్టాలని ఆదేశించింది.
వివిధ సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు సర్కారు చేసిన ఖర్చుల వివరాలను రాబట్టనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు లోపాలను క్షేత్రస్థాయిలో అధికారికంగా తెలుసుకోవటం ద్వారా ప్రజల సమస్యలను పట్టిచూపటానికి సమాయత్తమవుతున్నారు. గవర్నమెంట్ ఎలాగూ ఇన్ఫర్మేషన్ ఇవ్వదని, కనీసం ఆర్టీఐ దరఖాస్తుల ద్వారానైనా కాస్త సమాచారాన్ని సేకరిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. ఆర్టీఐ అప్లికేషన్లకు కూడా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించకపోతే పాలకుల ఉద్దేశాలు స్థానిక ప్రజలకు ఆటోమేటిగ్గా తెలిసిపోతాయి.
తప్పు చేయనప్పుడు, నిధులు దుర్వినియోగం కానప్పుడు అఫిషియల్ డేటాను పంచుకోవటానికి ఎందుకు వెనకాడుతున్నారంటూ నిలదీయటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అధికారులు సమాచారం అందిస్తే దాని ఆధారంగా లోటుపాట్ల పైన, అవకతవకల పైన ధీటుగా స్పందించొచ్చు. అందుకే ఈ ఆర్టీఐ క్యాంపెయిన్‌ని త్వరలో ప్రారంభించబోతున్నామని సుభాష్ వివరించారు. ఇందులో భాగంగా బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1200కు పైగా గ్రామ పంచాయతీల్లో ఆర్టీఐ అప్లికేషన్లను సమర్పించనున్నారు.
గ్రామంలో ఏయే పథకాలను అమలుచేశారు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి? వాటిని వేటికి కేటాయించారు? అనే వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి కోరతారు. బండి సంజయ్‌తోపాటు బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి కూడా ఇప్పటికే ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. వివిధ మీడియాలకు టీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రకటనల ఖర్చు ఎంతో చెప్పాలని కోరారు. దీన్నిబట్టి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 2023 చివరలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్‌లో విజయం సాధించేందుకు తెలంగాణ బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కన్నా ఎక్కువగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ని ఇరికించేందుకు టీ-బీజేపీ అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటోందని అనటానికి ఇదే నిదర్శనమని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కమలదళం బలహీనంగా ఉందనే విమర్శలకు కూడా దీంతో చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. వచ్చే శాసన సభ ఎన్నికల దిశగా పార్టీ శ్రేణులను ఇప్పటినుంచే ఇలా సమాయత్తం చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.