Telangana Governor: జై తమిళిసై.. ప్రజల్లోకి వెళుతూ ప్రత్యేకంగా నిలుస్తున్న తెలంగాణ గవర్నర్.

0
970

Telangana Governor: తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలు తమిళిసై సౌందరరాజన్‌ గత గవర్నర్ల కన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లోకి వెళుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్ర పర్యటనలు చేస్తున్నారు. సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తెస్తున్నారు. రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్‌ నిర్వహిస్తూ అవసరమైనవారికి తన పరిధిలో ఆర్థిక, న్యాయ, పరిపాలన తదితర సహాయాలు చేస్తున్నారు. “వ్యవస్థ ఏదైనా అది ప్రజల కోసమే కదా ఉన్నది” అని తమిళిసై అంటుంటారు. అది అక్షరాలా నిజం.

సహజంగా గవర్నర్లు ఆఫీసును, అధికారిక నివాసాన్ని దాటి బయటికి రారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానిస్తే తప్ప, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి రమ్మని పిలిస్తే గానీ వెళ్లరు. వివిధ వర్గాల నాయకులు, ప్రతినిధులు రాజ్‌భవన్‌కి వచ్చి కలిస్తే మాట్లాడి వినతిపత్రాలు తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేస్తారు. జాతీయ పండుగల్లో పాల్గొంటారు. ప్రభుత్వం పంపే బిల్లులను, ఫైల్స్‌ను ఆమోదించటమో, తిరస్కరించటమో లేక రాష్ట్రపతి ఆమోదానికి పంపటమో చేస్తుంటారు. యూనివర్సిటీల స్నాతకోత్సవాల్లో పాల్గొంటారు.

గవర్నర్‌ తమిళిసై ఇవన్నీ చేస్తూనే ప్రజల సమస్యల పరిష్కారంపై వ్యక్తిగతంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. దీంతో జనం ఇన్నాళ్లూ రాజ్‌భవన్‌ వైపు కన్నెత్తి చూడాలంటేనే అమ్మో అనుకునేవారు. అది మన స్థాయి కాదనుకొని వెనకాడేవారు. కానీ ఇప్పుడు తమకు ఏ సమస్య ఎదురైనా చెప్పుకునేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. గవర్నరే కాంటాక్ట్‌ నంబర్‌ ఇచ్చి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చంటూ ఆహ్వానిస్తున్నారు. గతంలో గవర్నర్లు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంతలా చొరవ తీసుకునేవారు కాదనే అభిప్రాయం నెలకొంది.

ఎక్కువగా గుళ్లను, గోపురాలను సందర్శించేవారనే విమర్శ కూడా ఉండేది. తమిళిసై సైతం దేవాలయాలకు వెళుతున్నారు. అదే సమయంలో ప్రజలనూ పట్టించుకుంటున్నారు. సహజంగా ప్రజాప్రతినిధులే ఇలా పబ్లిక్‌లో తిరుగుతుంటారు. వాళ్లకు ఓట్లు కావాలి కాబట్టి నిత్యం జనంతో టచ్‌లో ఉంటారు. మీడియాలో ప్రచారమూ చేయించుకుంటారు. కానీ గవర్నర్‌ తమిళిసైకి ఆ అవసరంలేదు. అయినా విస్తృతంగా ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. కరోనా, వరద తదితర సమయాల్లో బాధితుల వద్దకే వెళ్లి వాళ్లతో నేరుగా మాట్లాడుతున్నారు. తద్వారా రోజూ వార్తల్లో నిలుస్తున్నారు.

అధికార పార్టీ నుంచి విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా పనిచేయట్లేదని స్పష్టం చేస్తున్నారు. ఎవరికీ భయపడబోనని కూడా తేల్చిచెబుతున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా నెరవేరుస్తానని అంటున్నారు. ఒక మహిళ అయుండి ఇలా పట్టుదలగా పనిచేస్తుండటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారతకు నిలువుటద్దంలా నిలుస్తున్నారని, రాజ్యాంగబద్ధ వ్యవస్థకు వన్నె తెస్తున్నారని పేర్కొంటున్నారు. జై తమిళిసై అంటున్నారు.
also read: Telangana BJP: ‘బండి’ బాటలో.. ఇక ప్రతి గ్రామంలోనూ ఆర్టీఐ ‘పంచాయితీ’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here