ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ రాజకీయ పార్టీలకు అస్త్రంగానే ఉంది.. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అంటూ పలు సందర్భాల్లో పార్లమెంట్ వేదికగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ స్పష్టం చేసింది.. అయితే, తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ.. ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. తిరుమలలో ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలవరం పూర్తి కాలేదు.. ప్రత్యేక హోదా సాధించలేదన్నారు.. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ని గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు మల్లారెడ్డి.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని తెలిపారు మంత్రి మల్లారెడ్డి.. 8 సంవత్సరాల కాలంలో తెలంగాణలో చేసిన అభివృద్దిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారన్న ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ నుంచి 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయం.. అంతేకాదు విజయం సాధించడం కూడా ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి మల్లారెడ్డి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ఎస్ విస్తరణపై గురి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు.. ఇవాళ ఏపీకి చెందిన పలువురు నేతలు.. మాజీమంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. మరికొందరు ఏపీ నేతలు కూడా గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.