Telugu Desam Party: అన్-పార్లమెంటరీ పదాలకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ లేటెస్ట్‌గా విడుదల చేసిన జాబితాతోపాటు పార్లమెంట్ ఆవరణలో నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌పై తెలుగుదేశం పార్టీ ఇంకా ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. స్వాగతించటం గానీ వ్యతిరేకించటం గానీ చేయలేదు. ఇవాళ జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఈ రెండు అంశాలపై అసలు చర్చించనేలేదు. రేపు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో పార్టీ నిర్ణయాన్ని, వైఖరిని తెలియజేస్తామని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపై వ్యవహరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. భేటీ వివరాలను ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్(రాజ్యసభ), కె.రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్(లోక్‌సభ) మీడియాకి వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ముకే మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించటంతో ఆ పార్టీ ఎంపీలు ఆమెకు ఓటేయనున్నారు.
గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం (14వ, 15వ విడతల్లో) ఇచ్చిన నిధులు పక్కదారి పట్టడంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్న అక్రమ మైనింగ్ అంశాన్నీ ప్రస్తావించనున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలో అధికార పార్టీ (వైఎస్సార్సీపీ) ఎంపీలు విఫలమయ్యారని టీడీపీ ఎంపీలు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఆర్థిక ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని అన్నారు.
వైఎస్సార్సీపీ ఏపీని ఏవిధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందో కేంద్రం దృష్టికి తేనున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఇప్పటికే రూ.8 లక్షల కోట్లకు చేరటం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ గుంటూరు వెళ్లటానికి హెలికాప్టర్, విదేశాలకు వెళ్లటానికి చార్టర్డ్ ఫ్లైట్ వాడుతున్నారని మండిపడ్డారు. ఇది ఎవరి సొమ్మని ఆయన ఇలా దుబారా చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతుంటే మరో వైపు జగన్, అతని బినామీ కంపెనీలు భారీ లాభాలు ఆర్జించటం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు.
జాతీయ రాజధాని ఢిల్లీకి పలుమార్లు వచ్చివెళ్లిన సీఎం జగన్.. ప్రధాని మోడీని కలిసి సెల్ఫీలు దిగటం తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకున్న ఒక్క సందర్భం కూడా లేదని ధ్వజమెత్తారు. ఏపీకి సంబంధించిన సమస్యలను లేవనెత్తితే కేంద్రం తనను సీబీఐ, ఈడీ కేసుల్లో జైలుకు పంపుతుందేమోనని జగన్ భయపడుతున్నాడని తెలుగుదేశం పార్టీ ఎంపీలు విమర్శించారు.