ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు వర్షాలు దంచికొడుతున్నాయి.. మరోవైపు వరదలు ముంచేస్తున్నాయి.. ఏ పని చేయలేని పరిస్థితి.. ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టడమే గగనంగా మారింది. అయితే, ఇలాంటి పరిస్థితి వచ్చినా ఓ పెళ్లి మాత్రం ఆగలేదు.. ఓవైపు వరదలు ముంచెత్తుతున్నాయి.. మరోవైపు పెళ్లి ముహూర్తం ముంచుకొస్తుంది.. రోడ్డు మార్గంలో వెళ్లే పరిస్థితి లేదు.. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే.. గోదావరి వదర భయపెడుతోంది.. ఆ సమయంలో.. పెళ్లి కూతురుకు, ఆమె బంధువులకు పడవే ఆధారంగా మారింది.. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో పెళ్లి కూతురిని పడవలో తీసుకెళ్లారు బంధువులు.. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు, వరదలు ఎక్కువగా ఉంటాయని భావించిన రెండు కుటుంబాలు.. ముందుగానే అంటే జులై నెలలో ముహూర్తం పెట్టుకున్నారు.. అయినా, వారికి వరద కష్టాలు తప్పలేదు.. ఈ రోజు ఉదయం జరిగిన అశోక్ – ప్రశాంతి పెళ్లి జరిగింది.. భారీ వరదలు, ముంపుల కారణంగా.. పెదపట్నంలంక నుంచి పెళ్లికూతురు ప్రశాంతిని.. పడవపై కేశనపళ్లిలోని వరుడు అశోక్ ఇంటికి తీసుకెళ్లారు పెళ్లికూతురు బంధువులు.. ఆ తర్వాత వివాహం జరిపించారు. మొత్తంగా ఇవాళ ఉదయం పెళ్లితో ఆ జంట ఒక్కటైంది.
కల్యాణం వచ్చినా, కక్కొచ్చొనా ఆగదని చెబుతుంటారు పెద్దలు.. అంతెందుకు పెద్ద వానే వచ్చినా.. భారీ వరద వచ్చినా కూడా వీరి పెళ్లి ఆపలేకపోయిందంటూ.. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. మొత్తంగా పెళ్లి కూతురు పడవలో వరుడి ఇంటికి వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. కాగా, గోదావరిలో క్రమంగా వరద పెరుగుతూనే ఉంది.. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు.. కొత్తగూడెం నుంచి మినహా భద్రాచలానికి వచ్చే మార్గాలన్నింటిని గోదారమ్మ ముంచేస్తోంది.. మరోవైపు.. ధవళేశ్వరం దగ్గర క్రమంగా వరద పెరుగుతోంది.. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మూడో ప్రమాద హెచ్చరికను సైతం దాటి గోదావరి ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక, మరో మూడు రోజుల పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.