TRS Party: ‘ఎస్‌.. అలర్ట్‌ అయింది టీఆర్ఎస్‌’

0
751

‘నీళ్లు-నిధులు-నియామకాలు’ నినాదంతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సాగించి, విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటింది. ఇప్పటివరకు ఎక్కువగా నీళ్లు-నిధుల పైనే ఫోకస్‌ పెట్టింది. నియామకాలను పెద్దగా చేపట్టలేదు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత గులాబీ పార్టీ మీద ఇన్నాళ్లూ గుర్రుగా ఉన్నారు. తెలంగాణ సమాజంలోని ఈ మూడు వర్గాలు మినహా మిగతా అన్ని వర్గాలకూ న్యాయం చేసి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న టీఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడోసారీ అసెంబ్లీ ఎలక్షన్‌లో విక్టరీపై గట్టి పట్టుదలగా ఉంది.

2023 శాసన సభ ఎన్నికల్లో నెగ్గటం కోసం ఇప్పటినుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వాటిని ఒక్కొక్కటిగా అమలుచేయటం మొదలుపెట్టింది. 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియమాక ప్రక్రియను ప్రారంభించింది. గ్రూప్‌-1, పోలీస్‌ కొలువుల ప్రకటనలు జారీ చేసి పరీక్షల దీశగా పయనిస్తోంది. టీఎస్‌ టెట్‌ని విజయవంతంగా నిర్వహించి ఫలితాలను సైతం వెల్లడించింది. ఇక టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ రావటమే తరువాయి. వైద్యారోగ్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీతోపాటు గ్రూప్‌-4 జాబుల కోసం త్వరలో ప్రకటనలు రానున్నాయని సీనియర్‌ మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు.

ఇంటర్‌, టెన్త్‌ విద్యార్థులకు కొత్తగా రెసిడెన్షియల్స్‌ను అందుబాటులోకి తేవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు లేదా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థుల కోసం ఒక్కో నియోజకవర్గంలో నాలుగు చొప్పున స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన సోమేష్‌ కుమార్‌కి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు విడుదల చేయటంతోపాటు పెండింగ్‌లో ఉన్నవాటినీ క్లియర్‌ చేయాలని హరీష్‌ రావు సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెప్పారు.

ఈ మేరకు ఆయన నాలుగు రోజుల కిందట అధికారులతో ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నిర్ణయాలతో యూత్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల ఉన్న అసంతృప్తిని, ఆందోళనను తొలగించి తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆశిస్తున్నారు. తద్వారా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేస్తున్న నిరుద్యోగ దీక్షలకు కౌంటర్‌ వేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ తదితర విపక్ష పార్టీలు యువతను మరింత రెచ్చగొట్టకుండా ప్రసన్నం చేసుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్‌ పార్టీ అలర్ట్‌ అయింది.

పరోక్షంగా ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, డీవైఎఫ్‌ఐ వంటి స్టూడెంట్‌ యూనియన్లతోపాటు బీసీ సంక్షేమ సంఘం డిమాండ్లనూ అమలుచేసినట్లు ఉంటోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వ ఉత్సాహం చూస్తుంటే ఇక నిరుద్యోగ భృతిని కూడా అమలుచేస్తారేమో అనే నమ్మకం కలుగుతోంది. యూనివర్సిటీల్లోని రీసెర్చ్‌ స్కాలర్లకు ‘కేసీఆర్‌ స్టైపెండ్‌’ ప్రపోజల్‌ సైతం పట్టాలెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్‌ వినిపిస్తోంది. ఇవన్నీ చేస్తే తెలంగాణ యువతంతా అధికార పార్టీకి అభిమానులుగా మారతారనటంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు సూచిస్తున్నారు. కమాన్‌.. కారు పార్టీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here