అదిరిందయ్య కేసీఆరూ.. కొత్త పార్టీ.. సొంత ఫ్లైట్..

0
732

టీఆర్ఎస్‌ పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పెట్టి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు.. గత కొంత కాలంగా కేంద్ర విధానాలను ఎండగడుతూ.. జాతీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.. ఇక, ఈ మధ్య ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా.. జాతీయ పార్టీ పెడుతున్నా.. మీ మద్దతు కావాలి.. ఇస్తారా? నాతో వస్తారా? అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ వస్తున్నారు.. కొత్త పార్టీకి సమయం రానేవచ్చింది… దసరా రోజే జాతీయ పార్టీపై తీర్మానం, ప్రకటన ఉండబోతోందట.. అయితే, జాతీయ పార్టీ అధినేతగా కేసీఆర్‌.. దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది.. దీంతో, ఆయన పర్యటనలకు ఇబ్బందిలేకుండా.. ఓ ప్రత్యేక విమానం కొనుగోలు చేసేందుకు టీఆర్ఎస్‌ నిర్ణయం తీసుకుందట.. కొత్త విమానం కోసం దసరా రోజే ఆర్డర్‌ ఇచ్చే యోచనలో టీఆర్ఎస్‌ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

కేసీఆర్‌ కోసం కొనుగోలు చేసే ఈ ప్రత్యేక విమానం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ రూ. 80 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం.. 12 సీట్లతో కూడిన ఆ విమానం కొనుగోలుకు దసరా రోజు ఆర్డర్‌ ఇవ్వాలని గులాబీ పార్టీ నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.. ఈ నెల 5వ తేదీన కొత్త పార్టీపేరు ప్రకటించిన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు ఆర్డర్‌ ఇవ్వాలని గులాబీ పార్టీ బాస్‌ నిర్ణయానికి వచ్చారట.. ఇక, ప్రాంతీయ పార్టీ అయినా.. టీఆర్ఎస్‌ దగ్గర డబ్బులకు మాత్రం కొదవలేదు.. ఇప్పటికే ఆ పార్టీ ఖజానాలో రూ.865 కోట్ల వరకు ఉన్నాయి.. కానీ, పార్టీ కొనుగోలు చేయనున్న చిన్న విమానం కోసం విరాళాలు సేకరించాలని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన తర్వాత.. తెలంగాణలో వరుస పర్యటనల కోసం హెలికాప్టర్‌ను వినియోగించారు కేసీఆర్‌.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతుండడంతో.. తమకు ఓ ప్రత్యేక విమానం ఉంటే.. దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడం సులువు అవుతుందనే ఈ నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగుతోంది. విమానంలో 12 సీట్లు ఉండడంతో.. కేసీఆర్‌తో పాటు ఇతర కీలక నేతలు కూడా వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నమాట.. హెలికాప్టర్‌తో తెలంగాణలో చక్రం తిప్పిన గులాబీ బాస్‌.. ఇప్పుడు విమానంలో దేశ రాజకీయాల్లో కీలకంగా మారతారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారట పార్టీ శ్రేణులు. అయితే, 12 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ విమానం దాదాపు రూ. 80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నప్పటికీ, పార్టీ అధినేత మాత్రం 6 సీట్ల జెట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ప్రత్యేక అజెండాను రూపొందించుకుని, ఆ ఎజెండాను దేశమంతటా విస్తరించేందుకు సుడిగాలి పర్యటనకు వెళతారని పార్టీ వర్గాలు చెబుతున్నమాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here