వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా..? అయితే ఇది మీకోసమే..

0
871

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఎప్పుడైనా భక్తుల రద్దీ ఉంటుంది.. ఇక, వైకుంఠ ఏకాదశి లాంటి ప్రత్యేక రోజుల్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులు పాటు భక్తులకీ వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.. సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను భక్తులకు ముందుగానే జారీ చేస్తామని.. సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో ప్రతి నిత్యం 50 వేల టికెట్లు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ప్రతి నిత్యం 25 వేలు ఆన్‌లైన్‌ కేటాయిస్తామన్నారు. అయితే, వైకుంఠ ద్వారాలు తెరిచే పది రోజులు పాటు టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తామని ఈవో స్పష్టం చేశారు. దర్శన టికెట్లు లేని భక్తులు తిరుమలకు అనుమతిస్తాం.. కానీ, వారిని దర్శనానికి మాత్రం అనుమతించే అవకాశం ఉండదన్నారు.. ఇక, లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అవకతవకలు పాల్పడుతున్నారని.. ఇప్పటికే ఏడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులపై కేసులు నమోదు చేశామన్నారు.. నెల రోజులుగా లడ్డూ కౌంటర్లో నిఘా వ్యవస్థను పటిష్టపర్చడంతో.. కాంట్రాక్ట్ ఉద్యోగులు కుట్రకు పాల్పడుతున్నారన్న ముందస్తు సమాచారంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి శ్రీవారి ఆలయ ఆనంద నిలయానికి బంగారు తాపడం పనుల ప్రారంభించి.. ఆరు నెలలు లోపు తాపడం పనులను పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సుబ్బారెడ్డి అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్ లో సమావేశమైన పాలకమండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం నిర్వహించి బంగారు తాపడం పనులను ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. బంగారు తాపడం పనులు నిర్వహిస్తున్న సమయంలో దర్శన విధానంలో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. భక్తులు సమర్పించిన బంగారంతోనే తాపడం పనులు నిర్వహిస్తామన్నారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని.. గతేడాది తరహలోనే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 గంటల నుంచి 8 గంటల మధ్య ప్రారంభిస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here