Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి పదవీ కాలం రేపటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న సోమవారం ఢిల్లీలోని రాజ్యసభ లోపల, బయట వీడ్కోలు కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. పార్లమెంటులోని పెద్దల సభకే పెద్ద(చైర్మన్)గా ఐదేళ్లు వ్యవహరించిన వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక పెద్ద వ్యాఖ్య చేశారు. ‘నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ ఎవరి కాళ్లూ మొక్కలేదు’ అని అన్నారు. పార్టీ అగ్ర నేతలు వాజ్‌పేయి, అద్వానీలను దేవుళ్లతో సమానంగా భావించినా కూడా వాళ్ల కాళ్లే మొక్కలేదని గుర్తుచేశారు.
ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గా ప్రసంగాలు చేసే వెంకయ్య నాయుడి నోట ఇలాంటి అరుదైన, అనూహ్యమైన మాట రావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యాఖ్యను ఒక్కొక్కరు ఒక్కోలా అర్థంచేసుకుంటున్నారు. ఏ రంగంలో ఉన్నా స్వశక్తిని నమ్ముకోండి తప్ప ఎవరి దయాదాక్షిణ్యాల పైనా ఆధారపడొద్దని ఆయన దేశ ప్రజలకు సూచించినట్లు కొందరు భావిస్తున్నారు. మరికొందరేమో దీని వెనక వేరే ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు. తనను రాష్ట్రపతిని చెయ్యాలంటూ ఎవరినీ వేడుకోవాల్సిన అవసరం, గత్యంతరం తనకు లేదని పరోక్షంగా మోడీ, అమిత్‌షాను ఉద్దేశించి అన్నట్లు చెబుతున్నారు.
Narendra Modi:ఉప రాష్ట్రపతి వెంకయ్యకు వీడ్కోలు.. మోడీ ఏమన్నారంటే?
పైకి అలా అన్నప్పటికీ తాను రాష్ట్రపతిని కాలేకపోయాననే అసంతృప్తి వెంకయ్య నాయుడి వ్యాఖ్యల్లో ధ్వనించినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. నిజానికి.. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయినప్పుడు ఆయన భవిష్యత్తులో రాష్ట్రపతి అవ్వాలని తెలుగు ప్రజలు కోరుకున్నారు. రామోజీరావు అంతటివారే తన పత్రికా ముఖంగా ఈ ఆకాంక్షను వెలిబుచ్చారు. అప్పట్లో రామోజీరావుకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా పలు సందర్భాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. స్వచ్ఛ భారత్‌కి ప్రచారం చేసిపెట్టమని కోరారు. అమిత్ షా అయితే ఏకంగా ఫిల్మ్‌సిటీకే వెళ్లి రామోజీరావుని కలిసి వచ్చారు.
కేంద్ర ప్రభుత్వంతో అప్పట్లో ఉన్న అనుబంధం దృష్ట్యా రామోజీరావుకి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అయ్యే సూచనలు కొట్టొచ్చినట్లు కనిపించాయేమో అని ఆయన పేపర్ చదివిన అందరికీ అనిపించింది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా జరిగింది. వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాలేకపోయారు. అసలు ఉపరాష్ట్రపతి కావటమే తనకు ఇష్టంలేదని స్వయంగా వెంకయ్య నాయుడే పలుమార్లు పరోక్షంగా చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యానని, ప్రొటోకాల్స్ వల్ల ప్రజలను స్వేచ్ఛగా కలవలేకపోతున్నానని అసంతృప్తి కూడా వెలిబుచ్చారు. నిన్న కూడా అదే మాట మళ్లీ అన్నారు.
ఈ నెల 10వ తేదీ తర్వాత (రేపటి నుంచి) తనకు స్వాతంత్ర్యం రాబోతోందని చెప్పారు. దీంతో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లి ఎవరినైనా కలిసే అవకాశం లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. అయితే.. ఎలాగూ ఉపరాష్ట్రపతి అయ్యారు కాబట్టి ఇక రాష్ట్రపతిగా ప్రమోషన్ పొందితే బాగుండేది. ఎందుకంటే ఒకసారి ఉపరాష్ట్రపతిగా చేసిన వ్యక్తి మళ్లీ కేంద్ర మంత్రిగానో మరో పదవినో చేపట్టలేరు. అలాంటి వ్యక్తికి రాష్ట్రపతి పదవే అల్టిమేట్. కానీ అది వెంకయ్య నాయుడికి అందలేదు. అందుకే కాస్త ఫ్రస్టేషన్‌లో అంత పెద్ద మాట అన్నారని ఆ నోటా ఈ నోటా వినిపిస్తోంది.