ఆ గట్టునుంటావా ఆచార్య.. ఈ గట్టుకొస్తావా?

0
523

మెగాస్టార్‌ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా?. రావాలని చిరు మనసులో లేకపోయినా కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీలు సాదరంగా స్వాగతిస్తే ఆయన కాదంటారా?. అటు సినిమా పరిశ్రమలో, ఇటు ప్రజల్లో చిరంజీవిపై ఉన్న ‘అందరివాడు’ అనే అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలచుకునేందుకు బీజేపీ, వైసీపీ ప్రయత్నించకుండా ఉంటాయా?. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే ఈ లెజెండ్‌ యాక్టర్‌ మరోసారి యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది.

ఎందుకంటే భీమవరంలో జరిగిన అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రి కిషన్‌ రెడ్డి ‘ఆచార్య’ను ఆహ్వానించారు. దీన్నిబట్టి కమలదళం చిరంజీవికి ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థంచేసుకోవచ్చు. మరో వైపు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇదే కార్యక్రమంలో మెగాస్టార్‌ని ‘సోదరుడు చిరంజీవి’ అంటూ ప్రత్యేకంగా వెల్‌కం చెప్పారు. సీఎం జగన్‌ చిరంజీవి పేరు ప్రస్తవించగానే ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. జనం ఆయన్ను ఎంతగా ఇష్టపడుతున్నారో ఈ సందర్భం తెలియజేసింది.

కాబట్టి మెగాస్టార్‌ ఇమేజ్‌తో తమ మైలేజ్‌ పెంచుకోవాలని బీజేపీ, వైసీపీ ఆశిస్తాయనటంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. కాకపోతే ఆయన పాలిటిక్స్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలనుకుంటే ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ రంగస్థలంపైకి రీఎంట్రీని ఏ బ్యానర్‌ ద్వారా చేస్తారనేది చర్చనీయాంశమవుతోంది. చిరంజీవి ఇప్పటికే ఉమ్మడి ఏపీలో అసెంబ్లీలోకి, ఆ తర్వాత పార్లమెంట్‌లో పెద్దల (రాజ్య) సభలోకి అడుగుపెట్టారు. అందువల్ల ఇంకోసారి శాసన సభకి ప్రాతినిధ్యం వహించాలని బహుశా అనుకోకపోవచ్చు.

కారణం ఏంటంటే సొంత పార్టీ తరఫున అసెంబ్లీకి వెళితే ఆ గౌరవం ఒక రేంజ్‌లో ఉంటుంది. కానీ ఇప్పుడు చిరంజీవికి సొంత పార్టీలేదు. కొత్త పార్టీ పెట్టడమో లేక ప్రజారాజ్యాన్ని తిరిగి తెర మీదికి తేవటమో ఇప్పట్లో సాధ్యంకాదు. జనసేనలో జాయిన్‌ అయ్యే సంకేతాలేమీ ఇప్పటివరకు వెలువడలేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోకి అసలే పోరు. అందువల్ల వైఎస్సార్సీపీ తరఫునో, బీజేపీ నుంచో ఒక ఎమ్మెల్యేగా శాసన సభకు వెళ్లాలి. అది మెగాస్టార్‌ లెవల్‌కు కరెక్ట్‌ కూడా కాదు. ఈ నేపథ్యంలో ఆయన గనక వెళితే ఇక లోక్‌సభకే వెళ్లాలి.

అక్కడైతే వైసీపీ ఎంపీగా అయినా బీజేపీ ఎంపీగా అయినా చిరంజీవికి తగిన గౌరవ మర్యాదలు లభిస్తాయి. తన కరిజ్మాతో ఢిల్లీలో ఆయా పార్టీలకు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తారు. ‘అన్నయ్య’ ఒకవేళ వైఎస్సార్సీపీలో చేరితే ఏపీలో ‘తమ్ముడు’ పవన్‌ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జనసేనాధినేత బీజేపీకి మిత్రపక్షం కాబట్టి. మెగాస్టార్‌, పవర్‌ స్టార్‌ పొలిటికల్‌గా పరస్పరం విమర్శించుకోవటాన్ని తెలుగు ప్రజలు హర్షించరు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే చిరంజీవి బీజేపీలో చేరటమే బెస్ట్‌ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మెగాస్టార్‌ గతంలో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేసినందున బీజేపీ కేంద్రంలో మూడోసారి గెలిస్తే ఆయన రెండోసారి సెంట్రల్‌ మినిస్టర్‌ అవ్వొచ్చు. చిరంజీవి పార్టీని విలీనం చేసుకోవటం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బాగానే లాభపడింది. ఉమ్మడి ఏపీలో వరుసగా రెండోసారి నెగ్గింది. కాబట్టి బీజేపీ భవిష్యత్తులో ఏపీలో బలపడాలంటే అటు పవన్‌ కళ్యాణ్‌ని, ఇటు చిరంజీవిని ‘డబుల్‌ ఇంజన్‌’ మాదిరిగా బరిలోకి దించితే ఆ సినిమానే వేరుగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here