టీడీపీ నేతపై హత్యాయత్నానికి టీడీపీ నేతే కారణం: వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి

0
876

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై దాడికి ప్రధాన సూత్రధారి పమ్మి వెంకటేశ్వరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం తనంతట తానే స్వయంగా రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడన్నారు. దాడికి గురైన బాలకోటిరెడ్డి, దాడికి పాల్పడిన వెంకటేశ్వరరెడ్డి ఇద్దరు బంధువులే అని ఎమ్మెల్యే వివరించారు. టీడీపీలో ఇద్దరి మధ్య జరిగిన వర్గపోరే దాడికి కారణమన్నారు. ఇద్దరి మధ్య వర్గపోరు నాలుగు రోజుల నుంచి తీవ్రమైందన్నారు.

ఇద్దరి మధ్య పలువురు టీడీపీ నేతలు సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా అది విఫలమైందని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు దాడులు చేసుకున్నా ఆ నింద వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు వాస్తవాలు తెలుసుకునే ఓపిక లేని చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, జీవీ ఆంజనేయులు, పత్తిపాటి పుల్లారావు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు స్టేట్ మెంట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యాయత్నానికి వైసీపీ నాయకులకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పష్టం చేశారు. రొంపిచర్ల ఎంపీపీ భర్తపై చేసే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

అంతకుముందు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారని చంద్రబాబు ట్వీట్ చేశారు. వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్లతో దాడి చేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? జగన్ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here