ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్లీనరీ ఇవాళ రెండో రోజు కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం పార్టీ అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ఎన్నుకుంటారని అంటున్నారు. అదే సమయంలో ఇకపై ఆయన్నే పార్టీకి శాశ్వత అధినేతగా ప్రకటిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒక నేతను “పర్మనెంట్ ప్రెసిడెంట్” చేయాలంటే పార్టీ రాజ్యాంగానికి సవరణలు చేసి, కేంద్ర ఎన్నికల సంఘానికి(సీఈసీకి) పంపి, ఆమోదం పొందాల్సి ఉంటుంది. గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామాతో భవిష్యత్తులో ఆ పదవిని కొనసాగించే అవకాశాల్లేవు. ఈ మేరకు కూడా పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలి.
పార్టీ రాజ్యాంగాన్ని సవరిస్తామంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌ని జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటిస్తే ఇకపై ఆ పదవికి ఎన్నిక నిర్వహించరు. వచ్చే మూడేళ్లపాటు అమల్లో ఉండే పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకునే అధికారాన్ని సైతం ఆయనకే అప్పగిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ అధికారాన్ని సైతం అధ్యక్షుడు జగన్‌కే దఖలుపరిస్తే మూడేళ్ల తర్వాత జరిగే ప్లీనరీలోనూ పార్టీ కార్యవర్గ ఎన్నిక ఉండబోదు. ఇంతకీ ఈ లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్‌ని వైఎస్సార్సీపీకి ఎవరిచ్చారనేది చర్చనీయాంశంగా మారింది.
ఏపీకి పక్కనున్న తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకి కరుణానిధి ఉండగా ఆయనే శాశ్వత అధ్యక్షుడు. అన్ని పార్టీల కన్నా ముందుగా డీఎంకేనే ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ రాజ్యాంగానికి సవరణ చేసి సీఈసీ అనుమతి పొందింది. అందువల్ల కరుణానిధి బతికి ఉన్నంతకాలం ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరించారు. కరుణానిధి మరణానంతరమే ప్రస్తుత అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడయ్యారు. ఈయన కూడా తండ్రి మార్గంలోనే లైఫ్ టైమ్ ప్రెసిడెంట్‌గా కొనసాగనున్నారు.
అయితే ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రస్తుత ప్లీనరీ నుంచే ఈ పర్మనెంట్ ప్రెసిడెంట్ అనే సవరణను అమల్లోకి తెస్తుందా లేక తదుపరి ప్లీనరీ నుంచి ఫాలో అవుతుందా అనే క్లారిటీ రాలేదు. సాయంత్రానికి గాని స్పష్టతరాదు. ఇదిలా ఉండగా ‘వైఎస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడు’ అనే అంశంపై ఏపీలోని ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. అదేం పార్టీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ‘వైఎస్సార్సీపీలో ఎన్నికలే ఉండవంట. ఇలాంటి చెత్త ఆలోచనలు గతంలో ఎవరికికైనా వచ్చాయా’ అని ఎద్దేవా చేశారు.
తాము అలా నియంతలా చేయట్లేదని, రెండేళ్లకోసారి ‘మహానాడు’లో అత్యంత పారదర్శకంగా పార్టీ నాయకుల అభీష్టం మేరకు అధ్యక్షుణ్ని ఎన్నుకుంటున్నామని చెప్పుకొచ్చారు. లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ అనేదానిపై వైఎస్సార్సీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడకముందే ఇలాంటి స్పందన వస్తుంటే ఇక ఆ తర్వాత ఎవరెలా మాట్లాడతారో చూడాలి. మొత్తానికి వైఎస్సార్సీపీ ప్లీనరీ ఏపీ రాజకీయాల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీయబోతోందా అని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.