దేశంలో ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు జికా వైరస్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జికా వైరస్ కూడా తన ఉనికిని చాటుకుంటోంది. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన ఒక నమూనాలో జికా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధ్యయనంలో చాలా రాష్ట్రాలకు జికా వైరస్ వ్యాపించిందని స్పష్టమైంది. ఈ అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించగా.. 64 నమునాలు జికా వైరస్ పాజిటివ్‌గా తేలాయి. అందులో తెలంగాణలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో సేకరించిన నమునా కూడా ఉంది.
అటు తెలంగాణతో పాటు ఢిల్లీ, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో వైరస్ ఉనికిని గుర్తించారు. దోమల వల్ల వచ్చే జికా వైరస్‌తో జ్వరం, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, కండరాల నొప్పులుంటాయి. డెంగ్యూలాగే ఈ వైరస్ ప్రమాదకరం. వర్షాకాలంలో డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి దోమల కాటు ద్వారా సంక్రమించే వ్యాధుల పెరుగుదలతో జికా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. 2017 నుంచి 20121 వరకు జికా వైరస్ దేశంలోని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కనుగొన్నారు. గతంలో గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే జికా వైరస్ వ్యాప్తి చెందింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు జికా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గతంలో జికా వైరస్ అంటే ఏంటో చాలా మందికి తెలియదని.. ప్రస్తుతం అందరికీ దీనిపై అవగాహన వస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.