సంపన్నులకు మాఫీలు, పేదవాడిపై పన్నుల భారం.. కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్

0
122

ఉచిత హామీలు, పథకాలపై బీజేపీకి, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మాటల వార్‌ కొనసాగుతోంది. కేంద్రంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. కార్పొరేట్‌ సంపన్నుల రూ.10లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్రం.. పేదవాళ్లపై పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు. బియ్యం, గోధుమలు కొనుగోలు చేసే నిరుపేద కూడా పన్నులు చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందని ఆయన మండిపడ్డారు. 2014లో కేంద్ర బడ్జెట్ రూ 20 లక్షల కోట్లు.. అది ఇప్పుడు రూ.40లక్షల కోట్లకు చేరిందని.. అందులో రూ.10లక్షల కోట్లు సంపన్నుల రుణమాఫీ చేయడానికే కేంద్రం ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపించారు. పెద్దపెద్ద కంపెనీలకు కూడా ఈ ప్రభుత్వం మాఫీ చేసిందన్న కేజ్రీవాల్ .. అలాంటి రుణాలను మాఫీ చేయకుంటే పేద ప్రజల అన్నంపై పన్నులు విధించే పరిస్థితి వచ్చేదే కాదని కేంద్రంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. అలా అత్యంత పేదలపైనా పన్నుల భారం మోపుతోందంటే కేంద్రం ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

కేంద్ర ప‌న్నుల్లో రాష్ట్రాల వాటా త‌గ్గింపు, ఆహారోత్పత్తుల‌పై జీఎస్టీ, జాతీయ ఉపాధి హామీ ప‌ధ‌కంలో 25 శాతం కోత విధించ‌డం ద్వారా స‌మ‌కూరిన నిధులు ఏమ‌వుతున్నాయ‌ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్ ద్వారా ఏటా రూ 3.5 ల‌క్షల కోట్లు కేంద్రం వ‌సూలు చేస్తోంద‌ని.. మ‌రోవైపు సైనికుల‌కు పింఛన్లు చెల్లించేందుకు కూడా నిధుల లేమిని సాకుగా చూపుతోంద‌ని కేజ్రీవాల్ దుయ్యబ‌ట్టారు. తమ అగ్నిపథ్ యోజనను సమర్థిస్తూ, రక్షణ సిబ్బందికి ఇకపై పింఛన్లు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతోందన్నారు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే వాటిలో కొంత మాత్రమే రాష్ట్రాలకు ఇస్తుందని కేజ్రీవాల్‌ వెల్లడించారు. అంతకుముందు రాష్ట్రాలకు 42శాతం ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు అది దాదాపు 29 నుంచి 30శాతానికి పడిపోయిందన్నారు. 2014తో పోలిస్తే ఇప్పుడు రెండు, మూడు రెట్లు అదనంగా పన్నులను కేంద్రం వసూలు చేస్తోందని… ఆ డబ్బంతా ఎక్కడికి పోతోందని కేంద్ర ప్రభుత్వాన్ని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here