ఆధునిక వైద్య విధానాలపై యోగా గురువు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రచారాలను నిర్వహించవచ్చని, అయితే ఇతర వైద్య వ్యవస్థలను విమర్శించకూడదని పేర్కొంది. “బాబా రామ్‌దేవ్ అల్లోపతి డాక్టర్లపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చారు.. మంచిదే. కానీ ఇతర వ్యవస్థలను విమర్శించకూడదు. ఆయనను అనుసరిస్తే అన్నింటికీ నయం అవుతుందనే గ్యారంటీ ఏమిటి?” అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు.
అల్లోపతి మందులు, ఆ విధానంలో వైద్యం చేసే వైద్యులు, కొవిడ్-19 వ్యాక్సినేషన్‌పై దుష్ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఐఎంఏ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కోరుతూ ధర్మాసనం కేంద్రానికి నోటీసులు కూడా జారీ చేసింది.
గతేడాది కొవిడ్ రెండో వేవ్ సమయంలో బాబా రాందేవ్ అల్లోపతి వైద్య విధానాలపై చేసిన వ్యాఖ్యల వల్ల దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. “అల్లోపతి మందుల వల్ల లక్షల మంది మరణించారు. వారికి చికిత్స లేదా ఆక్సిజన్ అందక మరణించిన వారి కంటే చాలా ఎక్కువ. అల్లోపతి మూర్ఖమైన, దివాళా తీసిన శాస్త్రం” అని కూడా యోగా గురువు రాందేవ్ బాబా పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా భారతదేశంలో చాలా మంది వైద్యులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత వైద్య మండలితో పాటు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లోపతి వైద్య విధానాన్ని ఆయన కించపరుస్తున్నారంటూ వైద్య మండలి మండిపడింది. ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో రాందేవ్ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మరోవైపు, రాందేవ్‌కు వ్యతిరేకంగా పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడేందుకు రామ్‌దేవ్ అల్లోపతి, ఆధునిక వైద్యం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల ప్రతిష్టను దెబ్బతీశారని భారత వైద్య మండలి పేర్కొంది. ఆయుర్వేదంపై తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని బాబా రామ్‌దేవ్‌ను ఢిల్లీ హైకోర్టు గత వారం కోరింది. కొవిడ్ -19 కోసం పతంజలి కరోనిల్‌ను ఉపయోగించడం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణపై బాబా రామ్‌దేవ్‌పై వివిధ వైద్యుల బృందాలు దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ విచారించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు టీకాలు వేసినప్పటికీ కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని యోగా గురువు చేసిన ప్రకటనపై కోర్టుకు సమాచారం అందింది.