TRS Parliamentary Party : ముగిసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

0
139

 

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం మాని, తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలన్నారు. ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సి వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల కాలంలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని, కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని ఎండగట్టేందుకు కార్యాచరణపై ఎంపీలతో ముఖ్యమంత్రి చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోతున్న నేపథ్యంలో, సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా, భారత పౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉన్నదని, అందుకు పార్లమెంటు ఉభయ సభలే సరైన వేదికలుగా మలుచుకోవాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఆర్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోడీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నదని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణకంటే ఎక్కువగా ఉన్నాయని, కానీ, పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్న తీరును ఎంపీలకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని సీఎం తెలిపారు. ఆర్.బి.ఐ. వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయం వాస్తవం కాదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోడీకి కన్నుకుట్టిందని, నిబంధనల పేరుతో ఆర్ధికంగా తెలంగాణను అణచివేయాలని చూడటం అత్యంత శోచనీయమన్నారు.

తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎట్లా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలని సీఎం అన్నారు. దేశానికి, రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం.. నేరపూరిత చర్య అని సీఎం స్పష్టం చేశారు. ఇదంతా ఒక పకడ్బందీ పథకం ప్రకారం జరుగుతున్న బీజేపీ రాజకీయ దిగజారుడుతనమని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ జాతీయ నాయకత్వం చౌకబారు రాజకీయాలను ఆశ్రయించడం దురదృష్టకరమని సీఎం అన్నారు.

ప్రతిఏటా ఎఫ్.ఆర్.బి.ఎం లిమిట్ ను కేంద్రం ప్రకటిస్తుందని, ఆ తర్వాతే రాష్ట్రాలు కేంద్రం ప్రకటనపై ఆధారపడి వారి వారి బడ్జెట్లను రూపొందించుకుంటాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఎఫ్.ఆర్.బి.ఎం లిమిట్ రూ.53,000 కోట్లు అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా, కక్షపూరితంగా రూ.53 వేల కోట్ల లిమిట్ ను రూ.23,000 కోట్లకు కుదించడం కుట్ర కాదా? అని సీఎం అన్నారు. ఇటువంటి దివాళాకోరు, తెలివితక్కువ వ్యవహారాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీని నిలదీస్తూ, వారి నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేయాలని ఎంపీలకు స్పష్టం చేశారు. అందుకు అన్నిరకాల ప్రజాస్వామిక పద్ధతులను అనుసరించాలని సీఎం వారికి దిశా నిర్దేశం చేశారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here