సూపర్ స్టార్ కృష్ణ మృతికి పలువురు సంతాపం తెలిపారు. పద్మభూషణ్, సూపర్ స్టార్, మాజీ ఎం.పీ డాక్టర్. కృష్ణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..సినిమా రంగంలో అనేక విప్లవత్మక మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని.లోటు. కృష్ణ హైదరాబాద్ లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసారు.కృష్ణ గారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా… ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అన్నారు రేవంత్ రెడ్డి.
మధుయాష్కీ
టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ మృతికి పలువురు సంతాపం తెలిపారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్, దిగ్గజ నటుడు సూపర్ స్టార్, ఘట్టమనేని కృష్ణ ఆకస్మిక మరణం అత్యంత దురద్రుష్టకరం. తెలుగు సినీ వినీలాకాశం ధృవతారగా వెలుగొందిన కృష్ణ అస్తమయం సినీ రంగానికి తీరని లోటు. ఎన్నో సరికొత్త ప్రయోగాలతో తెలుగు సినిమా రంగానికి ఆయన దిక్సూచీలా నిలిచారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ యువ మంత్రానికి ముగ్ధుడైన కృష్ణగారు 1984లో కాంగ్రెస్ కుటంబంలో చేరి.. 1989 లోక్ సభ ఎన్నికల్లో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని ఏలూరు లోక్ సభ స్థానం నుంచి ఘనవిజయం సాధించి పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో కృష్ణ జన్మించిన కృష్ణగారి మరణం సినీరంగానికి తీరని లోటు. మహేష్ బాబుకు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు మాజీ ఎంపీ మధుయాష్కీ.
మంత్రి కేటీఆర్
తెలుగు సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి శ్రీ కే తారకరామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు మంత్రి కేటీఆర్.
తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి కేటీఆర్.
మంత్రి ఆర్ కె రోజా
సూపర్ స్టార్ కృష్ణ మృతి సినిమా పరిశ్రమకు తీరని లోటు అన్నారు మంత్రి రోజా. మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం బాధాకరం..కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.చదువుకునే రోజు నుంచి నేను కృష్ణ ఫ్యాన్ ని. ఆయన షూటింగులకు పరిగెత్తి వెళ్లేదాన్ని అని తన పాత రోజుల్ని గుర్తుచేసుకున్నారు మంత్రి రోజా.