”కాంగ్రెస్‌ను వీడాలని పెద్దలు కోరుకున్నారు.. అందుకే రాజీనామా చేశా”

0
129

కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అర్ధరహితంగా ఉందని గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. జీ23 లెటర్‌ రాయడమే రాహుల్‌ ఆగ్రహానికి కారణమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తన అవసరం లేదని కాంగ్రెస్‌ అనుకుందని.. అందుకే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మోడీ రాజ్యసభలో తన గురించి చెప్పలేదని.. కశ్మీర్‌లో జరిగిన ఓ సంఘటన గురించి మాట్లాడారన్నారు. తాను మోడీ ఏజెంట్‌ను కాదని ఆజాద్ చెప్పారు. లోక్‌సభలో మోడీని కౌగిలించుకున్నది ఎవరు.. నేనా అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాహుల్.. మోడీని ఓ సాకుగా చూపించారని ఆయన ఆరోపించారు. “ప్రధాని నరేంద్ర మోడీపై ఎడమ, కుడి, మధ్యలో దాడి చేయడమే రాహుల్ గాంధీ విధానం” అని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు చాలా వరకు సంప్రదింపుల రాజకీయాలను నమ్ముతారని కేంద్ర మాజీ మంత్రి ఆజాద్ అన్నారు. కానీ రాహుల్ గాంధీ హయాంలో అది నాశనం అయిందని ఆయన అన్నారు.”సోనియా గాంధీ, 1998-2004 మధ్య పూర్తిగా సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఆమె వారిపై ఆధారపడి ఉంది, సిఫార్సులను ఆమోదించింది. ఆమె నాకు ఎనిమిది రాష్ట్రాలు ఇచ్చింది, నేను ఏడు గెలిచాను, ఆమె జోక్యం చేసుకోలేదు. కానీ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత 2004 నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఎక్కువగా ఆధారపడటం మొదలుపెట్టారు. ఆయనకు అలా చేసే అర్హత లేదు. ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీతో సమన్వయం చేసుకోవాలని ఆమె కోరుకున్నారు” అని ఆజాద్ అన్నారు.

ఆ పార్టీ అధినేత్రి సోనియాకు రాసిన లేఖ‌లో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ తీవ్రంగా ఖండించారు. రాహుల్ అప‌రిప‌క్వత కాంగ్రెస్ పార్టీని నాశ‌నం చేసిన‌ట్లు ఆజాద్ ఆరోపించారు. పార్టీలో సంప్రదింపు వ్యవ‌స్థను రాహులే ధ్వంసం చేసిన‌ట్లు విమ‌ర్శలు గుప్పించారు. దుర‌దృష్టవ‌శాత్తు రాహుల్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీలో ఉన్న పాత విధానాలు దెబ్బతిన్నట్లు ఆజాద్ ఆరోపించారు. 2013లో రాహుల్‌ను పార్టీ ఉపాధ్యక్షుడిగా సోనియా నియ‌మించార‌ని, కానీ సంప్ర‌దింపుల వ్యవ‌స్థను రాహుల్ నాశ‌నం చేసిన‌ట్లు ఆరోపించారు. రాహుల్‌లో పరిపక్వత లేదనడానికి మరో సంఘటనను ఉదాహరణగా గులాం నబీ ఆజాద్ చెప్పారు. ఓ సారి ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ మీడియా ముందే బ‌హిరంగంగా చింపివేసిన‌ట్లు వెల్లడించారు. చిన్నపిల్లాడి మ‌న‌స్తత్వంతో వ్యవ‌స్థను చిన్నాభిన్నం చేసిన‌ట్లు ఆజాద్ ఆరోపించారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వ అధికారాల్ని చిన్న‌చూపు చూసిన‌ట్లు విమ‌ర్శించారు. 2014లో యూపీఏ ప్రభుత్వం ఓట‌మి చెంద‌డానికి అది ప్రధాన కార‌ణ‌మైన‌ట్లు ఆజాద్ ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here