ఎట్టకేలకు శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా చేశారు. సింగపూర్‌కు చేరిన తర్వాత శ్రీలంక స్పీకర్‌కు ఆయన రాజీనామా లేఖను పంపించారు. రాజపక్స వ్యక్తిగత విజిట్ కోసమే సింగపూర్ వచ్చారని ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆయన తమను ఆశ్రయం కల్పించమని కోరలేదని ప్రకటించింది. ఒకవేళ కోరినా ఆశ్రయం కల్పించమని స్పష్టం చేసింది. ఓ ప్రైవేట్ ఫ్లైట్‌లో ఆయన సింగపూర్ వెళ్లినట్లు తెలిసింది.
శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండగా రాజీనామా చేయకుండా దేశం దాటిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బుధవారం ఉదయం మాల్దీవులకు వెళ్లారు. మాల్దీవుల్లో కూడా రాజపక్సకు వ్యతిరేకంగా శ్రీలంకవాసులు ఆందోళనలు చేపట్టారు. ఇవాళ మాల్దీవుల నుంచి సింగపూర్‌కు చేరుకున్నారు. సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎస్వీ 788లో సింగపూర్ చేరుకున్నట్లు తెలిసింది. 73 ఏళ్ల గోటబయ రాజపక్సే జూలై 9న తన నివాసంపైకి నిరసనకారులు దాడి చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం తన రాజీనామా లేఖను అందజేస్తానని ఆయన ప్రకటించారు. అనంతరం రాజపక్స తన భార్యతో సహా మాల్దీవులకు పారిపోయారు. తదనంతరం, అతను శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను నియమించారు. ఇదిలా ఉంటే జూలై 20న పార్లమెంట్ ఓటింగ్ ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్థన్ తెలిపారు.