రాష్ట్రంలో వరుణుడు మళ్లీ భీభత్సం సృష్టించేందుకు సిద్దమయ్యాడు. రాష్ర్టానికి మరోమారు భారీ వాన ముప్పు వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు శుక్రవారం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొంది. రేపు శనివారం అతి భారీ వర్షాలు ఉంటాయని, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిమీటర్ల వేగంలో గాలి వేగం వుంటుందని తెలిపారు. ఈనేపథ్యంలో.. 7 నుంచి 9 వరకు అతి భారీ వర్షాలు కురిస్తాయని, 7 తేదీన 12 సెం.మీ. నుంచి 20 సెం.మీ. మేర, 8, 9 తేదీల్లో 20 సెం.మీ. కురుసే అవకాశం వుందని దీనిపై ప్రభుత్వానికి, ఎన్డీఆర్‌ఎఫ్ లకు సమాచారం ఇచ్చామని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు.
అయితే.. 7వ తేదీ లేక ఆ తరువాత వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు , దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. దీంతో పరిసర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే వానలకు జనం తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వరద నీటితో కాలనీలన్నీ జలమయమయ్యాయి. దీంతో వరదనీటితో బరద చేరి పలు ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. తెలంగాణ భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ సూచించింది.