ట్రాలీ బ్యాగుల్లో 45 తుపాకులు.. భార్యాభర్తలు అరెస్ట్

0
106

బ్యాగుల నిండా తుపాకులతో దేశంలోకి వచ్చిన ఇద్దరు భారతీయులను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిద్దరు భార్యభర్తలు జగ్‌జిత్‌ సింగ్‌, జస్విందర్‌ కౌర్‌లుగా గుర్తించారు. వీరితో పాటుగా 17 నెలల కుమార్తె కూడా ఉంది. ఈ జంట జులై 10న వియత్నాం నుండి ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ సిబ్బంది అవి నిజమైన తుపాకులేనని తెలిపారు.

జగ్‌జిత్‌ సింగ్‌ వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 తుపాకులు ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తుపాకులపై ఆరా తీశారు. అయితే ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నుంచి విమానంలో వియత్నాం వచ్చిన తన సోదరుడు మంజిత్‌ సింగ్‌ ఆ ట్రాలీ బ్యాగులను తనకు ఇచ్చినట్లు జగ్‌జిత్ సింగ్‌ తెలిపాడు. అయితే, వీరిద్దరూ ఇలా తుపాకులను చేరవేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఓసారి పిస్తోళ్లు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. టర్కీ నుంచి భారత్‌కు 25 తుపాకులు తెచ్చినట్లు విచారణ సందర్భంగా నిందితులు అంగీకరించారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్టు తెలిపారు. 45 తుపాకుల విలువ సుమారుగా రూ. 22 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దంపతులను కస్టమ్స్ ఏసీ సెక్షన్ 104 కింద అరెస్టు చేయగా, బిడ్డను వారి అమ్మమ్మకు అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here