ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. జాతీయ పార్టీ ప్రకటన ఎప్పుడు వస్తుందనే దానిపై సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి (BRS) అనే పేరు వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు..
డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ప్రగతి భవన్ లో కీలక భేటీలో పలు నిర్ణయాల గురించి చర్చ జరిగింది. తెలంగాణ భవన్ లో దసరా రోజున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ లు,జిల్లా అధ్యక్షులు, గ్రంథాలయ చైర్మన్ లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 6న ఢిల్లీకి ప్రతినిధుల బృందం వెళ్ళనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 5న దసరా పండుగ పురస్కరించుకుని లాంఛనంగా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీపై 283 సభ్యులతో అక్టోబర్ ఐదున తెలంగాణ భవన్ లో తీర్మానం చేయనున్నారు.
అక్టోబర్ 5న పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం ఉమ్మడి సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ పేరు గురించి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో గోప్యత పాటించనున్నారు. పార్టీ మార్పు, జాతీయ పార్టీగా విస్తరించడానికి సంబంధించి శాసనసభా పక్షం, పార్టీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించేలా కసరత్తు జరుగుతోంది. కొత్త జాతీయ పార్టీ పేరుపై చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తూ ఉత్కంఠను పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించవచ్చనే కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా చర్చించారు. దసరా నాడు నిర్వహించే సమావేశంలో పార్టీ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తూ ‘విజన్ డాక్యుమెంట్’ను విడుదల చేస్తారని అంటున్నారు.