మహారాష్ట్రలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సినిమా స్టోరీని మించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే శివసేన రెబెల్ ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని 39 శివసేన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మైనారిటీలో పడిందని.. వెంటనే ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు గవర్నర్ బలనిరూపణకు ఆదేశాలు జారీ చేశారు.
రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు. సాయంత్రం 5 గంటల వరకు బలనిరూపణకు డెడ్ లైన్ విధించారు. అయితే ప్రస్తుతం శివసేనకు 16 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఎన్సీపీకి 53, కాంగ్రెస్ పార్టీకి 44 సభ్యులు ఉన్నారు. మొత్తం 288 సభ్యులు ఉండే మహారాష్ట్ర అసెంబ్లీలో 144 మ్యాజిక్ ఫిగర్ అయితే ప్రస్తుతం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వానికి అంత బలం లేదు. ఇదే సమయంలో బీజేపీ కూటమికి 113 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో పాటు ఏక్ నాథ్ షిండే వర్గంలోని 39 మంది శివసేన ఎమ్మెల్యేలు, 7 గురు స్వతంత్రులు మద్దతు దక్కనుంది. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.
అయితే గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సుప్రీం ఈ పిటిషన్ ను విచారించనుంది. 16 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు సుప్రీంలో పెండింగ్ లో ఉండగా.. గవర్నర్ ఫ్లోర్ టెస్టుకు ఆదేశించడం చట్ట విరుద్ధమని శివసేన ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ సురేష్ ప్రభు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే గౌహతిలో ఉన్న ఏక్ నాథ్ షిండే వర్గం ప్రత్యేక విమానాల్లో గోవాకు వెళ్లనుంది. రేపు ఫ్లోర్ టెస్ట్ కు అక్కడ నుంచి ముంబై రానుంది.