CBI Director: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేస్తూ రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని వెల్లడించింది.ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్న హైపవర్ కమిటీ ఆయన నియామకానికి ఆదివారం ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ స్థానంలో ఆయనను ఎంపిక చేసినట్లు కేంద్రం పేర్కొంది. మే 25న జైశ్వాల్ పదవీ కాలం ముగుస్తున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రవీణ్ సూద్ రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర ప్రజా ఫిర్యాదుల, శిక్షణా శాఖ(డీవోపీటీ) వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టభద్రుడైన సూద్ 1989లో మైసూర్ ఏసీపీగా కెరీర్ ప్రారంభించారు.1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్ సూద్ గత మూడేళ్లుగా కర్ణాటక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఢిల్లీ ఐఐటీలో, ఐఐఎం బెంగళూరులో ఆయన చదువుకున్నారు. దాంతో పాటు న్యూయార్క్‌లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం చేశారు. మారిషస్ ప్రభుత్వానికి పోలీస్ సలహాదారుగానూ వ్యవహరించారు. బెంగళూరు కమిషనర్‌గా ఉన్న కాలంలో అత్యవసర సమయంలో సాయం అందించేందుకు రూపొందించిన ‘‘నమ్మ 100’’ కార్యక్రమం ప్రజలకు బాగా ఉపయోగపడింది. ప్రవీణ్ సూద్ 2024 మే నెలలో రిటైర్ కావాల్సి ఉంది. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా నియమితులైనందున మరో రెండేళ్లు సేవలందించనున్నారు.
సీబీఐ డైరెక్టర్‌గా కుదించిన పేర్ల జాబితాలో మధ్యప్రదేశ్ డీజీపీ ఎస్‌కే సక్సేనా, ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్ డీజీ తాజ్ హసన్ కూడా ఉన్నప్పటికీ ఆఖరికి ప్రవీణ్ పేరే ఖరారైంది. పోలీస్ అధికారిగా.. సాంకేతికత సాయంతో ట్రాఫిక్ నియంత్రణ, పౌరులకు ఉత్తమ సేవలు అందించేందుకు ప్రవీణ్ సూద్ కృషి చేశారు. ఇందుకుగాను 2006లో ప్రిన్స్ మైఖేల్ అంతర్జాతీయ రహదారి భద్రత అవార్డు, 2011లో నేషనల్ ఈ గవర్నెన్స్ గోల్డ్ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సేవలకు 1996లో ముఖ్యమంత్రి బంగారు పతకం, 2011లో రాష్ట్రపతి పోలీసు పతకం పొందారు. అదనపు డీజీపీ (కంప్యూటర్స్)గా ఉన్నప్పుడు క్రిమినల్ ట్రాకింగ్ వ్యవస్థ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ప్రవీణ్ సూద్ 2020 జనవరిలో కర్ణాటక డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.