Madhya Pradesh: మహిళా ఉద్యోగి జీతం రూ. 30 వేలు.. ఇంట్లో చూస్తే రూ. 30 లక్షల టీవీ, ఫారిన్ డాగ్స్, లగ్జరీ కార్లు..

0
60

మధ్యప్రదేశ్ లో ఓ ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉద్యోగి అవినీతి, అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం రూ.30,000 జీతం తీసుకునే మహిళా కాంట్రాక్ట్ ఇంజనీర్ హేమా మీనా బంగ్లాపై మధ్యప్రదేశ్ లోకాయుక్త పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపుగా రూ. 7 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె ఇంట్లో 10 లగ్జరీ కార్లు, రూ.30 లక్షల విలువైన టీవీ, విదేశీ డాగ్స్ ఇలా చాలా వస్తువులను అధికారులు సీజ్ చేశారు.

భోపాల్ సమీపంలోని బిల్ఖిరియాలో తన తండ్రి పేరు మీద రిజిస్టర్ అయిన 20,000 చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన 40 గదుల బంగ్లాలో హేమ మీనా నివసిస్తోంది. దీని ఖరీదు కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. మధ్యప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ (ఎంపిపిహెచ్‌సి)తో ఒప్పందంపై ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉన్న ఇంజనీర్ హేమ మీనా నెలవారీ జీతం రూ.30,000. ఇంత చిన్న జీతం ఉన్న ఉద్యోగిని ఎలా ఇన్ని ఆస్తులు సంపాదించిందా..? అని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జీతంతో పోలిస్తే 232 శాతం అధికంగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నిజంగా ఇన్ని ఆస్తులు ఉంటే ఆమె నెల సంపాదన 30,000లకు బదులుగా రూ. 18 లక్షలు ఉండాలని అధికారులు అంటున్నారు.

లోకాయుక్త డీఎస్పీ సంజయ్ శుక్లా ప్రకారం, హేమ మీనాపై 2020లో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందడంతో విచారణ ప్రారంభించి గురువారం దాడులు నిర్వహించారు. లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్పీఈ)కి చెందిన 50 మంది బృందం సాధారణ సివిల్ దుస్తులతో ఆమె నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహించారు. బంగ్లాకు ఉన్న గార్డులు ముందుగా అధికారులను లోనికి రానీవ్వలేదు. అయితే తాము వెటర్నరీ శాఖకు చెందిన వారమని, సోలార్ ప్యానెల్స్ తనిఖీ చేసేందుకు వచ్చినట్లు చెప్పారు.

ఈ సమయంలో అక్కడే ఉన్న హేమా మీనాను అదుపులోకి తీసుకుని, సోదాలు నిర్వహించారు. పిట్ బుల్, డాబర్మన్ సహా 50కి పైగా విదేశీ డాగ్స్ లభ్యమయ్యాయి. వీటి విలువ లక్షల్లో ఉంటుంది. వివిధ జాతులకు చెందిన 60-70 ఆవులు కూడా ఉన్నాయి. కుక్కలకు రోటీలు తయారు చేసేందుకు రూ.2.50 లక్షల రోటీ మేకర్ ఉంది. రెండు ట్రక్కులు, మహీంద్రా థార్ తో పాటు 10 లగ్జరీ వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెళ్లై విడాకులు తీసుకున్న హేమ మీనా మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలోని చప్నా గ్రామ నివాసి. ఆమెకు 2011లో కాంట్రాక్టు ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఆమె ఎంపీపీహెచ్‌సీ ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఆమె అవినీతిలో మరికొందరి అధికారుల హస్తం ఉందనే అవకాశం ఉందని, విచారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here