మన భారతదేశంలో అప్పుడప్పుడు కొన్ని వింత ప్రచారాలు వెలుగులోకి వస్తుంటాయి. ఇప్పుడు ఓ గ్రామంలో కుక్కలకు పెళ్లి చేసిన సంఘటన, అందరి దృష్టిని ఆకర్షించింది. అది కూడా హిందూ సంప్రదాయాల ప్రకారం ఘనంగా చేశారు. బీహార్‌లోని మోతిహారి మజురాహా గ్రామంలో జరిగింది ఈ వింత వేడుక! సాహ్ని, సబితా దేవిలకు కల్లు, బసతి అనే కుక్కలున్నాయి. ఈ కుక్కలకు యజమానులు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక మంచి ముహూర్తం సెట్ చేసి, బ్యాండ్ బాజాల్ని సెట్ చేసి, 400 మంది అతిథుల్ని ఆహ్వానించి.. గ్రాండ్‌గా వివాహం నిర్వహించారు.
అంతేకాదు.. ఆ కుక్కల్ని వధూవరుల తరహాలోనే అలంకరించారు. ఓ పురోహితుడితో వివాహ కృతువు జరిపించారు. ఈ వేడుకకి వచ్చిన వాళ్లందరూ డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అతిథుల కోసం భారీ విందు ఏర్పాటు చేశారు. అయినా.. ఎందుకు ఇంత జోరుగా పెళ్లి చేశారు? మంచి ఫలితం కోసమేనని పురోహితుడు తెలిపాడు. కుక్కలు భైరవ స్వరూపులు కాబట్టి, ఇలా వివాహం జరిపిస్తే అంతా శుభమే జరుగుతుందని అన్నాడు. బహుశా ఈ కుక్కల యజమానులకు ఏమైనా సమస్యలు ఉన్నాయేమో? అందుకే, కుక్కల పెళ్లి జరిపితే మంచి జరుగుతుందని, ఇలా ఘనంగా వివాహ వేడుకలు నిర్వహించినట్టున్నారు.