కిచెన్ లో బంగారు నాణేలు.. వేలంలో కోట్ల రూపాయలు

0
64

ఏదైనా నిధి దొరికితే బాగుండు నాకున్న అన్ని కష్టాలన్నీ తొలగి పోతాయి అని అనుకునే వారు మనలో చాలామందే ఉంటారు. కానీ ఓ కుటుంబం మాత్రం అలా అనుకోకుండానే వారికి నిధి దొరికింది. కానీ దానికోసం వారు ఎక్కడెక్కడో తవ్వకాలు జరపలేదండోయ్.. వారి పాత ఇంట్లో వంట గది పాడయిందని రినోవేషన్ చేయిస్తుంటే కలపతో చేసిన ఫ్లోరింగ్ కింద చిన్న పాటి డబ్బా బయట పడింది. ఏంటని తీసిచూస్తే అందులో తళుక్కుమంటున్న బంగారు నాణేలు బయటపడ్డాయి. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ లోని నార్త్‌ యార్క్‌ షైర్‌ పరిధిలోని ఎల్లెర్‌ బీ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

చెక్క ఫ్లోరింగ్‌ కింద దొరికిన డబ్బాలో మొత్తం 254 నాణేలను గుర్తించారు. వాటిని పరిశీలించగా.. 1720వ సంవత్సరంలో బ్రిటన్‌ పాలకులు జారీ చేసిన 50 పౌండ్లు, 100 పౌండ్ల బంగారు నాణాలుగా గుర్తించారు. మూడు వందల ఏళ్ల కిందటివి అందులో నాడు చలామణీలో ఉన్న బ్రెజిల్‌ బంగారు నాణెం కూడా ఉంది. మొత్తంగా ఈ నాణాలను లండన్‌ కు చెందిన స్పింక్‌ సంస్థ వేలం వేయనుంది. వేలం కోసం ఒక్కో బంగారు నాణానికి కనీస మొత్తంగా రూ.40వేల నుంచి రూ.లక్ష రూపాయల దాకా ధర నిర్ణయించారు. మొత్తం 254 నాణాలను వేలం వేయనున్నారు. అన్ని నాణాలకు కలిపి కనీస మొత్తంగా మూడు లక్షల డాలర్లు (సుమారు రెండున్నర కోట్లు) ధర నిర్ణయించారు. పాత నాణాలు కాబట్టి.. వేలంలో పాల్గొనే వారిని బట్టి వీటికి ధర పెరిగే అవకాశం ఉంటుందని వేలం సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ, ఆ అంచనా తప్పయింది. అంతకు మూడింతలు అంటే సుమారు రూ.7 కోట్లు ఆ సంపద ధర పలికిందని లండన్ కు చెందిన వేలం సంస్థ స్పింక్ అండ్ సన్ ప్రతినిధి గ్రేగరీ ఎడ్మండ్ తెలిపారు. ఫెర్న్ లీ-మాయిస్టర్స్ కాలానికి చెందిన నాణేలు కావడంతో అంత విలువ చేకూరిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here