విజయ్ దేవరకొండతో శ్రీదేవి కూతురా?
September 26,2018 02:14 PM
దివంగత తార శ్రీదేవి తనయ జాన్వీ విజయ్ దేవరకొండతో రొమాన్స్ కు రెడీ అవుతోందా? అఖిల్ కు నో చెప్పిన జాన్వీ దేవరకొండకు ఎస్ చెప్పిందా? విజయ్-జాన్వీతో భారీ బడ్జెట్ సినిమా ప్లానింగ్ జరుగుతోందా? అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి. జాన్వీ ఇటీవలే `దఢక్` సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైంది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. 100 కోట్ల వసూళ్లతో `దఢక్` దుమ్మిలేపింది. ఇద్దరు డెబ్యూలతో తెరకెక్కిన సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లా? అని ట్రేడ్ వర్గాలు సైతం విస్తుపోయాయి. నటి గా జాన్వీ బెస్ట్ లాంచింగ్ మూవీ అయింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ప్రస్తుతం కరణ్ జోహర్ బ్యానర్లోనే రెండవ సినిమాకు రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో ఒక్కో సినిమా కమిట్ అయిందని సమాచారం. అందులో ఒకటి విజయ్ దేవరకొండ సినిమా అని లీకైంది.ఆ సినిమా దర్శక, నిర్మాతలెవరు? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. భారీ గా పారితోషికం ఆఫర్ చేయడంతోనే విజయ్ సినిమాకు జాన్వీ ఒకే అన్న మాట మాత్రం వాస్తవమని కొన్ని సోర్సెస్ చెబుతున్నాయి. వాస్తవానికి అక్కినేని అఖిల్-వెంకీ అట్లూరి కాంబో లో తెరకెక్కుతోన్న సినిమాకి జాన్వీ కోసం ప్రయత్నించారు. కానీ జాన్వీ అప్పుడు అంగీకరించనట్లు తెలిసింది. తాజాగా ఆమె నిర్ణయాల్లో ఛెంజెస్ రావడంతోనే టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణంలో `తఖ్త్` అనే సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఆ సినిమాతో పాటు ఈ రెండు సినిమాల షూటింగ్ కు హాజరయ్యే అవకాశాలున్నాయని వినికిడి.